హైదరాబాద్ లో సంక్రాంతి రష్ షురూ అయ్యింది. రేపటి ( జనవరి 10 ) నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్ల బాట పట్టారు భాగ్యనగర వాసులు. ఈ క్రమంలో సిటీలోని ప్రధాన బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. MGBS, JBS బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని.. 6431 స్పెషల్ బస్సులను నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ.సౌత్ సెంట్రల్ రైల్వేస్ కూడా 153 సంక్రాంతి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలో శుక్రవారం ( జనవరి 9 ) నుంచి 11వ తేదీ వరకు రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ అయినట్లు తెలిపింది రైల్వే శాఖ. సొంతూళ్లకు బయలుదేరిన జనంతో బస్ స్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా ప్రత్యేక బస్సుల ద్వారా ఏర్పాట్లు చేసింది టీజీఎస్ఆర్టీసీ.స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది ఆర్టీసీ.
ఇక ఇదే అదునుగా మూడు రేట్లు అదనంగా చార్జీలు పెంచారు ప్రవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు.పండగల వేళ భారీగా పెరిగిన ఛార్జీల పై మండిపడుతున్నారు ప్రయాణికులు. ఇదిలా ఉండగా... సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని గురువారం విడుదల చేశారు. జనవరి 9 నుంచి 13 వరకు ట్రాఫిక్ అధికంగా ఉండనుందని, అలాగే జనవరి 16 నుంచి 19 మధ్య ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల వైపు పెద్దఎత్తున ప్రయాణాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్ – ఆరాంఘర్ కారిడార్, ఎస్‌ఆర్‌నగర్ – లక్డికాపూల్, రేతిబౌలి – ఆరాంఘర్(అత్తాపూర్ మార్గం), కాచిగూడ – రామంతపూర్, ఎంజీబీఎస్ – దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, పాదచారుల రాకపోకలతో తీవ్ర రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 90102 03626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) డి.జోయెల్ డేవిస్ సూచించారు.
