చెయ్యని పనులకు బిల్లులు ఇయ్యాలంటు బెదిరింపు

చెయ్యని పనులకు బిల్లులు ఇయ్యాలంటు బెదిరింపు

మద్దూరు, వెలుగు: చెయ్యని పనులకు బిల్లులు రాసివ్వమని నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని చింతల్ దిన్నె సర్పంచ్​ లక్ష్మి భర్త ఆశప్ప తనను వేధిస్తున్నాడంటూ పంచాయతీ కార్యదర్శి లలిత గురువారం స్థానిక ఎంపీఓకు కంప్లైంట్​చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. తాను డ్యూటీలో చేరి రెండు నెలలు అవుతోందని, అప్పటి నుంచి గ్రామ అభివృద్ధికి సహకరించకుండా ఆశప్ప ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించింది. మహిళా ఉద్యోగిని అని చూడకుండా దురుసుగా మాట్లాడుతున్నాడని వాపోయింది. చెయ్యని పనులకు బిల్లులు రాసివ్వాలని డిమాండ్ ​చేస్తున్నాడని చెప్పింది. సర్పంచ్​ భర్త ప్రవర్తనతో డ్యూటీకి వెళ్లాలంటేనే భయంగా ఉందని బాధపడింది. తట్టుకోలేకనే ఎంపీఓ వేణుగోపాల్​కు కంప్లైంట్​చేశానని వివరించింది. ఈ విషయమై ఆశప్పను వివరణ కోరగా రెండున్నర ఏండ్ల కింద 30డేస్ ప్లాన్​లో భాగంగా సొంత డబ్బుతో ఏర్పాటు చేసిన 480 ట్రీగార్డుల బిల్లులు ఇంతవరకు ఇయ్యలేదని చెప్పారు. రోడ్లకు ఇరువైపులా నాటిన 800 చెట్లకు సపోర్టుగా కట్టిన కర్రలు, ట్రీగార్డుల బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ సెక్రెటరీ సతాయిస్తుందన్నారు. మొత్తం రూ.1.50లక్షల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. బిల్లులు అడిగినందుకు ఎంపీఓకు కంప్లైంట్​చేసిందన్నారు.