కామన్వెల్త్‌‌‌‌లో అంచనాలు అందుకున్నాం

కామన్వెల్త్‌‌‌‌లో అంచనాలు అందుకున్నాం
  • నా గోల్డ్‌  డబుల్స్‌ షట్లర్లను ఇన్‌స్పైర్‌ చేస్తుంది
  • ‘వెలుగు’తో  ఇండియా డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ సాత్విక్‌ 

 

హైదరాబాద్​, వెలుగు:కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌ టీమ్‌‌‌‌ అంచనాలను అందుకున్నదని డబుల్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌, తెలుగు కుర్రాడు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌ చెప్పాడు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో  గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ కోల్పోయిన తర్వాత  వ్యక్తిగత ఈవెంట్లలో సత్తా చాటాలన్న కసి పెరిగిందన్నాడు. చిరాగ్‌‌‌‌ షెట్టితో కలిసి మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో తాను  ఇండియాకు తొలి గోల్డ్‌‌‌‌ అందించానంటే  మొన్నటిదాకా నమ్మలేకపోయానని చెప్పాడు. ఈ మెడల్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ను  కెరీర్‌‌‌‌గా ఎంచుకునే యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌లో స్ఫూర్తి కలిగిస్తుందన్నాడు.  ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గడమే తన టార్గెట్‌‌‌‌ అంటున్న సాత్విక్‌‌‌‌ కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో తన ఆట, భవిష్యత్‌‌‌‌ లక్ష్యాలను ‘వెలుగు’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..

ప్రత్యేక అనుభూతి
కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ అంటే ఎప్పుడూ స్పెషల్‌‌‌‌గానే ఉంటుంది. బ్యాడ్మింటన్‌‌‌‌ మాత్రమే కాకుండా ఇతర ఆటగాళ్లను, ఇతర  దేశాల ప్లేయర్లను కలుసుకొని, వాళ్లతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఈసారి నా ఆట చూసేందుకు మా అన్న, వదిన కూడా బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌ వచ్చారు కాబట్టి మరింత ప్రత్యేక అనుభూతి  కలిగింది. పైగా ఇండియా టీమ్‌‌‌‌ చాలా బాగా పెర్ఫామ్‌‌‌‌ చేసింది. షూటింగ్‌‌‌‌ లేకుండానే ఇన్ని మెడల్స్‌‌‌‌తో టాప్‌‌‌‌4లో నిలిచామంటే చాలా గొప్ప విషయం. లాన్‌‌‌‌ బౌల్స్‌‌‌‌, లాంగ్‌‌‌‌జంప్‌‌‌‌ వంటి అంచనాలు లేని ఆటల్లోనూ పతకాలు వచ్చాయి. మాకసలు లాన్‌‌‌‌బౌల్స్ ఆట ఉందనే తెలియదు. బ్యాడ్మింటన్‌‌‌‌లో కూడా మంచి రిజల్ట్స్‌‌‌‌ వచ్చాయి. నాతో పాటు సింధు అక్క, లక్ష్యసేన్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ నెగ్గారు. శ్రీకాంత్‌‌‌‌ అన్న, గాయత్రి–ట్రీసా బ్రాంజ్‌‌‌‌ గెలిచారు. 

మాదే తొలి గోల్డ్‌‌‌‌ అంటే మొన్నటిదాకా నమ్మలేకపోయా    
2018 గోల్డ్‌‌‌‌గోస్ట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తొలిసారి గోల్డ్‌‌‌‌ గెలిచాం. ఈ సారి చిరాగ్‌‌‌‌తో కలిసి నేను మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో  తొలి గోల్డ్‌‌‌‌ నెగ్గా.  గెలిచినప్పుడు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ఇండియా తరఫున మాదే తొలి గోల్డ్‌‌‌‌ అంటే చాలా గర్వంగా  ఉంది.  ఈ విషయాన్ని మొన్నటిదాకా నమ్మలేకపోయా.  మా మెడల్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఆడాలనుకునే యంగ్‌‌‌‌ స్టర్స్‌‌‌‌ని ఇన్‌‌‌‌స్పైర్‌‌‌‌ చేస్తుందని అనుకుంటున్నా. బ్యాడ్మింటన్‌‌‌‌ అంటే సింగిల్సే కాదు.. డబుల్స్‌‌‌‌లోనూ బాగా ఆడొచ్చు.. గోల్డ్‌‌‌‌ కూడా గెలవొచ్చని వారిలో స్ఫూర్తి నింపుతుంది. 

సెలబ్రేషన్స్‌‌‌‌కు సమయం లేదు
ఈ నెల 22 నుంచి వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌ ఉన్నాయి కాబట్టి కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ విజయాన్ని ఆస్వాదించే సమయం లేకుండా పోయింది. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో ఈసారి బాగా రాణించాలని అనుకుంటున్నా. ఏదో ఒక పతకంతో తిరిగొస్తానని అనుకుంటున్నా.  రెండేళ్లుగా మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌పైనే ఫోకస్‌‌‌‌ పెడుతున్నా. ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గాలన్నది నా కల. అది సాధించి ఒలింపిక్‌‌‌‌ పోడియంపై ఇండియా జెండాను రెపరెపలాడించాలని అనుకుంటున్నా. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నా.

అప్పుడు కసి పెరిగింది
మిక్స్‌‌‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నిలబెట్టుకోలేకపోయినందుకు అందరం బాధ పడ్డాం. నాతో పాటు శ్రీకాంత్‌‌‌‌ అన్న, సింధు అక్క అందరూ చాలా ఫీలయ్యారు. మేం ఈ మధ్యే థామస్‌‌‌‌ కప్‌‌‌‌ నెగ్గాం.  కాబట్టి  ఈసారి కూడా గెలుస్తాం అన్న ధీమాతో ఉన్నాం. కానీ, ఫైనల్లో మలేసియా ప్లేయర్లు బాగా ఆడారు. దాన్ని ఒప్పుకోవాల్సిందే.  అయితే, టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌తో సరిపెట్టిన తర్వాత  మా అందరిలో  కసి పెరిగింది. సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌లో సత్తా చాటాలని అనుకున్నాం. పతకాలు రాబట్టాం.

వరల్డ్‌‌ నం.1 అయితేనే గర్వపడుతా
చిరాగ్‌‌, నేను ఆరేళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. మెన్స్‌‌ డబుల్స్‌‌లో ఇండియాలో మేమే నంబర్‌‌ వన్‌‌ అని ఎప్పుడూ పొంగిపోలేదు. నేను అంత త్వరగా సంతృప్తి చెందను. ఇండియాలో డబుల్స్‌‌ ప్లేయర్లు లేరు.. ఉన్నా బాగా ఆడలేరు అనేవారికి సమాధానం చెప్పాలనే  నేను డబుల్స్‌‌ను ఎంచుకున్నా.  కాబట్టి మా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేయాలి. వరల్డ్‌‌ నంబర్‌‌ వన్​ జోడీ అయినప్పుడే గర్వపడుతా.  నిలకడగా రాణిస్తే నం.1 పెద్ద కష్టమే కాదు.