న్యూఢిల్లీ: తెలుగు షట్లర్ భమిడిపాటి సాయి ప్రణీత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. మరో తెలుగు ప్లేయర్, మాజీ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్‌ను దాటి తొలిసారి టాప్–10లో అడుగుపెట్టాడు. మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రణీత్ ఒక స్థానం మెరుగై పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల పేలవంగా ఆడుతున్న శ్రీకాంత్ పది నుంచి పదమూడో ర్యాంక్‌కు పడిపోయాడు. సమీర్ వర్మ ఒక ప్లేస్ మెరుగై 16వ స్థానంలో నిలవగా, పారుపల్లి కశ్యప్ 25వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. జపాన్ స్టార్ కెంటో మొమోటా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో యంగ్ సెన్సేషన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది. థాయ్‌లాండ్ ఓపెన్ నెగ్గి, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ జంట తొమ్మిది నుంచి ఏడో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ఇక మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్ నిలబెట్టుకోగా, సైనా నెహ్వాల్ తొమ్మిదో ప్లేస్‌లో మార్పులేదు. జపాన్ షట్లర్ నొజోమి ఒకుహరాను వెనక్కునెట్టి చైనీస్ తైపీ స్టార్ తై జు యింగ్ మళ్లీ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది.


