దేశ ప్రజలు మోడీ మాట వింటే అక్షరాలా రూ.4లక్షల 28వేల కోట్లు సేవ్ అవుతాయ్ తెలుసా..?

దేశ ప్రజలు మోడీ మాట వింటే అక్షరాలా రూ.4లక్షల 28వేల కోట్లు సేవ్ అవుతాయ్ తెలుసా..?

ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలు పొదుపు మంత్రం పాటించి పెట్రోల్, బంగారం వాడకాన్ని తగ్గిస్తే దేశం 45 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4లక్షల 28వేల కోట్లు సేవ్ అవుతాయని అంచనా వేయబడింది. ప్రధానంగా 4 రంగాల్లో స్వల్ప మార్పులు చేస్తేనే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో కేవలం 10 శాతం తగ్గింపు పాటిస్తేనే దాదాపు రూ.లక్షా 28వేల480 కోట్లు మిగులుతాయి. అలాగే రికార్డు స్థాయిలో ఉన్న బంగారం దిగుమతులను 10 శాతం తగ్గిస్తే మరో రూ.68వేల 520 కోట్ల దేశం దాటవని తేలింది.

వ్యవసాయం, విదేశీ ప్రయాణాల నుంచి భారీ ఆదా:
రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించాలని ప్రధాని రైతులను కోరారు. రైతన్నలు దీనిని ఫాలో అయితే ఎరువుల దిగుమతులపై ఖర్చు చేసే సుమారు రూ.69వేల 470 కోట్లు తగ్గుతుందంట. ఇక మధ్యతరగతిలో పెరుగుతున్న విదేశీ విహారయాత్రలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటిని ఏడాది పాటు వాయిదా వేసుకుంటే.. మరో రూ.లక్షా50వేల 360 కోట్ల విదేశీ కరెన్సీని ఇండియా సేవ్ చేసుకోవచ్చని తేలింది. దీనికి తోడు వంటనూనె వాడకాన్ని ప్రజలు 10 శాతం తగ్గిస్తే మరో రూ.18వేల 550 కోట్లు ఇండియా దాటి బయటకు పోవు. 

బంగారం కొనటం ఆపితే..
ఒకవేళ దేశ ప్రజలు మోడీ పిలుపు మేరకు ఏడాది పాటు బంగారం కొనడం పూర్తిగా ఆపేస్తే.. ఆదా అయ్యే మొత్తం ఊహకందని రీతిలో ఉంటుంది. కేవలం గోల్డ్ దిగుమతుల ఆగితే ఇండియాకు ఒక్క ఏడాదిలో ఏకంగా రూ.6లక్షల 85వేల 200 కోట్లు ఆదా అవుతాయని లెక్కలు చెబుతున్నాయి. ప్రధాని సూచించిన అన్ని జాగ్రత్తలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు సేవ్ అవుతాయని తేలింది. అదే బంగారం దిగుమతులు కనీసం 10 శాతం తగ్గించినా రూ.68వేల 400 కోట్లు ఆదా అవుతాయి. దీంతో టోటల్ సేవింగ్స్ రూ. 4లక్షల 28వేల కోట్లకు చేరుతాయ్.

రూపాయి పతనం - పొదుపు అవసరం:
ప్రస్తుతం డాలరుతో రూపాయి విలువ 95.17 కు పడిపోవడం, విదేశీ మారక నిల్వలు వారం వ్యవధిలోనే రూ.74వేల 230 కోట్లు ఆవిరి అవటంతో దేశ ఆర్థిక భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ.. ప్రతి భారతీయుడు పాటించే పొదుపు మంత్రం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడే ఒక గొప్ప ఆయుధంగా మారుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. లక్షల కోట్ల రూపాయల ఆదా జరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మళ్లీ కోలుకోవడానికి బలమైన పునాది పడుతుందని వారు చెబుతున్నారు. చూడాలి భారతీయులు దీనిని ఎంత వరకూ ముందుకు తీసుకెళతారు అన్నది.