ఎస్బీఐ లాభం రూ.19వేల684 కోట్లు

ఎస్బీఐ లాభం రూ.19వేల684 కోట్లు
  • ఆదాయం రూ.1.40 లక్షల కోట్లు
  • మొత్తం ఏడాది లాభం రూ.80 వేల కోట్లు
  • షేరుకు రూ.17.35 డివిడెండ్

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌‌‌‌లో రూ.19,684 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.18,643 కోట్లతో పోలిస్తే ఇది 6 శాతం పెరుగుదల. కన్సాలిడేటెడ్ పద్ధతిలో లాభం రూ.19,643 కోట్లకు చేరింది. బ్యాంక్ మొండి బకాయిలు (ఎన్​పీఏలు) తగ్గడం లాభాల వృద్ధికి తోడ్పడింది. ఆదాయం రూ.1.43 లక్షల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం రూ.1.23 లక్షల కోట్లు ఉంది.

స్థూల ఎన్​పీఏలు 1.82 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గాయి. నికర ఎన్​పీఏలు 0.39 శాతానికి చేరాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి ఎస్​బీఐ రూ.80,032 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 13 శాతం ఎక్కువ. బ్యాంక్ బోర్డు ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్ ప్రకటించింది. మే 16 రికార్డు తేదీ కాగా, జూన్ నాలుగో తేదీన డివిడెండ్ చెల్లిస్తారు. ఫలితాల వెల్లడి తర్వాత బీఎస్​ఈ లో ఎస్​బీఐ షేర్లు దాదాపు 6 శాతం తగ్గి రూ.1,027.5 వద్ద ట్రేడ్ అయ్యాయి.