తెలంగాణలో ప్రారంభమైన స్కూల్స్..

తెలంగాణలో ప్రారంభమైన స్కూల్స్..

వేసవి సెలవుల తర్వాత బడిగంట మోగింది. ఇవాళ్టి నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కావడంతో పిల్లలు బడిబాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నీ తెరుచుకున్నాయి. మొదట్లో కాస్త లేటుగా స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయన్న ప్రచారం జరిగినా.. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారమే బడులు మొదలవుతాయని ప్రభుత్వం చెప్పడంతో ఇవాళ బడిగంట మోగింది. రాష్ట్రంలో దాదాపు 41 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. 59 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ బడిబాటపట్టారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం షురూ కానుంది. బడి బాటలో భాగంగా 70 వేల 698 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ సారి సర్కారి బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడికక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు బడికి వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలకాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 

ఎప్పటిలాగే ఈసారి కూడా పాఠ్యపుస్తలు లేకుండానే విద్యార్థులు బడులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఏటా బడులు ప్రారంభమైన రెండు మూడు నెలల తర్వాత పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తుంటారు. విద్యార్థులకు ఈజీగా అర్ధమయ్యేలా పాఠ్యాంశాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉండేలా పుస్తకాలు ప్రింట్ చేయాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈ సారి పాఠ్యపుస్తకాల పంపిణీ మరింత అలస్యం కానున్నట్లు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను ప్రతిసారి వేసవి సెలవుల్లోనే పూర్తిచేయాలని అనుకుంటున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని 7,289 కోట్ల రూపాయలతో దశలవారీగా చేపడుతున్నామని, మొదటిదశలో 9,123 స్కూళ్లలో 3,497 కోట్లతో 12 రకాల మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సబితారెడ్డి చెప్పారు.

అయితే కరోనాతో గత రెండేళ్ల పాటు నష్టం వచ్చిందన్న కారణంగా ఈ సారి ప్రైవేటు పాఠశాలలు ఫీజులను 30 శాతం వరకు పెంచాయని పేరెంట్స్ సంఘాలు చెబుతున్నాయి. ఆన్ లైన్ తరగతుల పేరుతో కరోనాలోనూ అందినంత దండుకున్నాయని,ఈ సారి భారీగా ఫీజులు పెంచాయని మండిపడుతున్నారు. ఫీజులు, బుక్స్, స్కూల్  యూనిఫాం, ట్రాన్స్ పోర్ట్ తో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 30 శాతం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేరెంట్స్ అంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులను విపరీతంగా పెంచుతున్నా.. ప్రభుత్వం పట్టనట్టుగా ఉంటోందని ఇప్పటికే పేరెంట్స్ అసోసియేషన్లు మండిపడుతున్నాయి.