చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. డీఎంకే, అన్నా డీఎంకే కౌన్సిలర్ల మధ్య మాటల యుద్దం సాగింది. దాదాపు కొట్టుకునే వరకు వచ్చింది. మాజీ సీఎం స్టాలిన్ ఫొటో డిస్ ప్లే విషయంలో డీఎంకే నేతలు.. పార్టీనేతలను కీర్తిస్తూ సభాసమయం వృధా చేస్తున్నారని అన్నాడీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీ నేతలను కీర్తిస్తే ఏం వస్తుంది.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి.. వాటిని పరిష్కరించాలి అని అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్దకు దూసుకుపోయారు. అంతే స్థాయిలో డీఎంకే కౌన్సిల్ సభ్యులు పోడియం దగ్గర రావడంతో సభ గందరగోళంగా మారింది.
కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగిన తీరుపై అన్నా డీఎం కే కౌన్సిలర్ కేపీకే సతీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వార్డుకు సంబంధించిన సమస్యలపై మాత్రమే మాట్లాడతానని ప్రజా సమస్యలపై చర్చించకుండా కౌన్సిలర్లు పార్టీ నేతలను పొగడటం సరికాదన్నారు. కొందరు కౌన్సిలర్ సభ జరుగుతుంటే తమ నేతలను కీర్తించడం, సమయాన్ని వృధా చేయడం ఏంటని ప్రశ్నించారు. అన్నాడీఎం కే కౌన్సిలర్ ముక్కు సూటి ప్రశ్నలకు సభలో ఉన్న డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది.
సభ మొదట్లో మాజీ సీఎం స్టాలిన్ ఫొటో ప్రదర్శనపై డీఎంకే కౌన్సిల్ సభ్యులు పట్టుబట్టడంతో సభ గందరగోళానికి కారణమైంది. అన్ని జోనల్ కార్యాలయాల్లో మాజీ సీఎం స్టాలిన్ ఫొటో పెట్టాలని డీఎం కే కౌన్సిల్ సభ్యుడు చిత్తరసు మేయర్ కు విజ్ణప్తి చేశారు. దీనిపై స్పందించిన మేయర్.. మాజీ సీఎం ఫొటోను జోనల్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఓ సర్కులర్ జారీ చేసింది.
