అలీ ఖమేనీ అంత్యక్రియలకు రండి: ప్రధాని మోడీకి ఇరాన్ ఆహ్వానం..!

అలీ ఖమేనీ అంత్యక్రియలకు రండి: ప్రధాని మోడీకి ఇరాన్ ఆహ్వానం..!

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు 2026, జూలై 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని మోడీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రధాని మోడీకి ఇరాన్ ఆహ్వానం పంపినట్లు న్యూఢిల్లీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ హతం:

2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. ఖమేనీ మరణంతో పశ్చిమాసియా భగ్గుమంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో దాదాపు 4 నెలలుగా మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తాజాగా ఇరాన్, అమెరికా మధ్య ప్రాథమిక శాంతి అవగాహన ఒప్పందం కుదరడంతో అలీ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. 

లాంఛనంగా ఖమేనీకి వీడ్కోలు:

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశాన్ని శాసించిన తమ సుప్రీం లీడర్‎కు లాంఛనంగా వీడ్కోలు పలకాలని ఇరాన్ నిర్ణయించింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 5, 6, 7 తేదీలలో టెహ్రాన్, ఖోమ్‌లలో జరగనున్నాయి. తుది కార్యక్రమం జూలై 9న మషద్ నగరంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇరాన్ ప్రపంచ దేశాల నాయకులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే మిత్రదేశమైన ఇండియా ప్రధానిని ఇరాన్ ఇన్వైట్ చేసింది. టెహ్రాన్, మషాద్, ఖోమ్‌ నగరాలలో జరిగే ఖమేనీ అంత్యక్రియలకు దాదాపు 20 మిలియన్ల మంది హాజరవుతారని అంచనా.