దేశంలోని మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలని బీజేపీ పార్టీ భావిస్తోందని.. అందులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా ఉన్నారంటూ యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయా రాష్ట్రాల్లో బయటపడుతున్న కుంభకోణాలు, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీ పాలిత మూడు రాష్ట్రాల్లో సీఎంలు మారబోతున్నట్లు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల కొనుగోలు చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. లేటేస్ట్‌గా యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. బుధవారం (జూన్ 24) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆయన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ ఒక కుట్ర పన్నిందని అన్నారు. గతంలో ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేశారని.. ఈ విషయం బీజేపీకి తెలియదా..? అని ప్రశ్నించారు.
ఇందులో కొత్తేమీ లేదని.. మోహన్ యాదవ్ కుటుంబంపై వచ్చిన భూ సేకరణ ఆరోపణలను కొట్టిపారేశారు. ఒకవేళ మోహన్ యాదవ్‌పై భూసేకరణ ఆరోపణలు నిజమైతే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా 300-600 ఎకరాల భూమిని సేకరించారు కదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో రాష్ట్రంలో బీజేపీ సీఎంలను మార్చాలనుకుంటుందని.. ఇందులో భాగంగానే వారి ప్రతిష్ట దెబ్బ తీసేందుకు బీజేపీ ఇలాంటి కుట్ర చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తొలగించాలని బీజేపీ భావిస్తోందని.. అయితే యోగిని ఒక్కడినే తొలగిస్తే సంఘ్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉండటంతో అతడితో పాటు మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడానికి ఇది బీజేపీ ఆడుతోన్న డ్రామా అని అన్నారు. సీఎం మార్పు గురించి ఉత్తరప్రదేశ్ ప్రజలకు తెలుసని అన్నారు.
అసలు వివాదం ఏంటంటే..?
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఫ్యామిలీపై పెద్ద ఎత్తున భూసేకరణ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోహన్ యాదవ్ సీఎం అయ్యాక ఆయన కుటుంబం ఉజ్జయినిలో సుమారు 168 ఎకరాల భూమి కొనుగోలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఆశ్చర్యకరంగా.. సీఎం ఫ్యామిలీ ఉజ్జయినిలో భూములు కొనుగోలు చేసిన కొన్ని రోజులకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035 ప్రకటించింది.
ఈ మాస్టర్ ప్లాన్ సీఎం ఫ్యామిలీ కొనుగోలు చేసిన భూముల గుండానే వెళ్లడం విశేషం. ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ గురించి ప్రభుత్వ ప్రకటనకు ముందే సీఎం కుటుంబం అధికారిక రహస్య సమాచారాన్ని సేకరించి ఈ భూములు కొనుగోలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
