కర్ణాటకలో సాగుతున్న ఒక భారీ మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మోసాల ముఠాను ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బట్టబయలు చేయటం దేశంలోని ఇన్సూరెన్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ఫేక్ యాక్సిడెంట్స్, తప్పుడు డాక్యుమెంట్లతో కోట్లాది రూపాయల క్లెయిమ్‌లు దండుకుంటున్న నెట్‌వర్క్‌పై తుమకూరు జిల్లాలోని హులియూరుదుర్గ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ఇందులో 9 మంది నిందితులపై FIR నమోదైంది. కుణిగల్ కోర్టులో ఇన్సూరెన్స్ కంపెనీ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, సమర్పించిన పక్కా ఆధారాల ఆధారంగా పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ముఠా యాక్సిడెంట్ క్లెయిమ్స్ కోసం ఒకే రకమైన విధానాన్ని ఫాలో అవుతోందని ఇన్సూరెన్స్ కంపెనీ దర్యాప్తులో తేలింది. అసలు ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వాహనాలను ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం స్టోరీలోకి లాగడం, ప్రమాదానికి సంబంధించిన ఫేక్ వివరాలను సృష్టించడం ఈ ముఠా పని. వీటన్నింటికీ మించి.. వేర్వేరు ప్రమాద కేసుల్లో ఒకే వ్యక్తులు వేర్వేరు పాత్రలు పోషించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఒక కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తి, మరో కేసులో నిందితుడిగా లేదంటే ప్రత్యక్ష సాక్షిగా మారుతూ నాటకమాడింది ఈ గ్యాంగ్.
ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మూడు క్లెయిమ్ కేసులపై ఐసీఐసీఐ లాంబార్డ్ డేటా అనలిటిక్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిఘా పెట్టింది. వీటిలో రెండు గాయాలకు సంబంధించిన క్లెయిమ్ కేసులు కాగా, ఒకటి మరణ పరిహారం కేసు. ఈ కేసుల ద్వారా దాదాపు రూ.10 లక్షల నుండి ఏకంగా రూ.కోటి వరకు క్లెయిమ్ మొత్తాన్ని దండుకోవాలని నిందితులు ప్లాన్ చేశారు. అయితే ఇన్సూరెన్స్ టీమ్ సేకరించిన ఆడియో, వీడియో ఆధారాలు, సాక్షుల కాల్ డేటా ఈ గుట్టును రట్టు చేశాయి. డబ్బుల కోసం వాహనాలను ఏర్పాటు చేసి దొంగ సాక్ష్యాలు చెప్పినట్లు నిందితులు ఒప్పుకున్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
పక్కా ఆధారాల దెబ్బకు అక్టోబర్ 2025లో కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఆ 3 క్లెయిమ్ కేసులను నిందితులు వెనక్కి తీసుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు కోర్టు సమయాన్ని, ఇన్సూరెన్స్ కంపెనీ శ్రమను వృథా చేసినందుకు గాను పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసి జరిమానా కూడా విధించింది. ఇలాంటి మోటార్ థర్డ్-పార్టీ క్లెయిమ్ మోసాల వల్ల మొత్తం ఇన్సూరెన్స్ వ్యవస్థ దెబ్బతింటుందని, టెక్నాలజీ సాయంతో ఇలాంటి మోసాలను ముందే అరికడతామని ఐసీఐసీఐ లాంబార్డ్ మోటార్ క్లెయిమ్స్ హెడ్ నజీమ్ ఖాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
