ఒక తెలుగు సినిమాలో పనిచెయ్ కానీ ప్రతిఫలం ఆశించకు అనే డైలాగ్ ప్రస్తుతం ఇండియాలోని ఉద్యోగులకు బాగా సూట్ అవుతోంది. ఆఫీస్ టైమింగ్స్ ముగిసినా అదనంగా పని చేయడం, లంచ్ బ్రేక్ మానేసి డ్యూటీ చేయడం చాలా మంది ఉద్యోగులకు అలవాటుగా మారిపోయింది. అయితే ఎలాంటి అదనపు వేతనం లేకుండా ఉచితంగా పనిచేసి పెట్టడంలో ప్రపంచంలోనే భారతీయ ఉద్యోగులు అగ్రస్థానంలో ఉన్నారని ఏడీపీ రీసెర్చ్ తాజాగా 'పీపుల్ ఎట్ వర్క్ 2026' రిపోర్ట్ వెల్లడించింది. మనదేశంలో దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు వారానికి 6 నుంచి 15 గంటల పాటు ఉచితంగా శ్రమిస్తుండగా.. మరో 24 శాతం మంది ఏకంగా 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం జీతం లేకుండా పనిచేస్తున్నారని తేలింది. ఈ రెండు కేటగిరీల్లోనూ గ్లోబల్‌గా ఇండియాదే టాప్ ప్లేస్ కావడం గమనార్హం.
ఉద్యోగంలో హోదా పెరిగే కొద్దీ ఈ ఉచిత పని భారం మరింత పెరుగుతోందట ఇండియాలో. సంస్థల్లోని సీనియర్ లీడర్లు, మేనేజర్లలో సగం మంది వారానికి కనీసం 6 గంటల అదనపు పని చేస్తుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్స్ లో 20 శాతం మంది 16 గంటలకు పైగా ఉచితంగా పనిచేస్తున్నారు. బాధ్యతలు, కంపెనీ అంచనాలు పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు సాధారణ ఉద్యోగులు మాత్రం 74 శాతం మంది తమ అదనపు పనిని వారానికి 5 గంటల లోపే ఉంచుకుంటున్నారని తేలింది.
వయసు పరంగా చూస్తే.. కెరీర్ ప్రారంభంలో ఉండే 18–26 ఏళ్ల యువ ఉద్యోగులు 31% అదనపు గంటలు పనిచేస్తున్నారట. వయసు పెరిగే కొద్దీ 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ ధోరణి కేవలం 16 శాతానికి పడిపోతోంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు ఆఫీసుకు వెళ్లినప్పటి కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారట. రిమోట్ ఉద్యోగుల్లో 35 శాతం మంది వారానికి 6 నుండి 15 గంటలు ఉచితంగా పనిచేస్తుండగా, ఆఫీసుకొచ్చి పనిచేసే వారిలో ఈ శాతం జస్ట్ 24 శాతం గానే ఉందని వెల్లడైంది.
ఇలా ఎక్కువ గంటలు పనిచేసే వారిలో ఉద్యోగం పట్ల నిబద్ధత, ఆసక్తి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. దీనివల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని తాజా రిపోర్ట్ హెచ్చరించింది. ఈ ఒత్తిడి కారణంగా చాలా మంది ఉద్యోగాలను వదిలేయాలని అనుకుంటున్నారట. కాబట్టి కంపెనీలు తమ ఉద్యోగుల పనిభారాన్ని సమీక్షించుకోవాలని, మేనేజర్లు స్పష్టమైన పని గంటలను కేటాయించాలని నివేదిక సూచించింది. అప్పుడే ఉద్యోగుల ఆరోగ్యం, ప్రొడక్టివిటీ బ్యాలెన్స్డ్‌గా ఉంటాయని స్పష్టం చేసింది రిపోర్ట్.
