సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, జిల్లా మంత్రులపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. కేవలం ఢిల్లీ దయతో నడుస్తున్న రెన్యూవల్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి కేవలం ఒక సామంతుడు మాత్రమే.. అందుకే ఊరికే ఢిల్లీ వెళ్లి కప్పం కట్టి వస్తున్నాడు. గతంలో కేసీఆర్ 11 సార్లు ఏకంగా 73 వేల కోట్ల రూపాయల రైతుబంధు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీకి 73 వేల సార్లు ప్రదక్షిణలు చేశాడు.. ఎందుకు వెళ్తున్నాడో మీకే తెలియాలి అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.
రైతు రుణమాఫీ, బోనస్‌లపై కాంగ్రెస్‌ను నిలదీస్తూ.. 40 వేల కోట్లు చాలు రుణమాఫీకి అని ఎడమచేత్తో ఇస్తా అన్న రేవంత్, ఇప్పుడు కేవలం 20 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. రూపాయిలో 40 పైసలు మాత్రమే మాఫీ చేసి.. మిగతా 60 పైసలు ఎగ్గొట్టారు. వడ్లకు బోనస్ ఏది? ధాన్యం కొనడానికి గన్నీ బ్యాగులు లేవు గానీ, ఆ సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి" అని మండిపడ్డారు.
విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు లేవని, ఫీజు రీఇంబర్స్‌మెంట్స్ ఇవ్వని పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నోటిఫికేషన్ల గురించి అడిగితే సీఎం రేవంత్ బూతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తూ.. కమల్ హాసన్ కంటే ఎక్కువ నటించే నాయకుడు భట్టి అని, ఒక్కో కుటుంబానికి రెండున్నర లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు కేటీఆర్.
పవర్ అంతా ఖమ్మం జిల్లా మంత్రుల చేతుల్లోనే ఉన్నా జిల్లాకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో ఉన్నా యూరియా కొరత రావడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంలో బీజేపీ ఉన్నా యూరియా కొరత రాలేదు.. ఇప్పుడెందుకు వస్తోంది? షాపుల్లో యూరియా ఉంటేనే కదా యాప్ ఉపయోగం? మా ప్రభుత్వం రాగానే ఈ యాప్‌ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తాం అని స్పష్టం చేశారు. అలాగే, బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూములను ఆంధ్రా కంపెనీకి తక్కువ ధరకే ఇచ్చి దోపిడీ చేస్తున్నారని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్ప వేరే వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
