- ఆధార్‌ను ప్రూఫ్‌గా అనుమతించడం లేదు
- మా దగ్గరేనా ఈ రూల్స్? అస్సాంలో ఎందుకు అమలు చేయట్లే?
- ఆరు లెటర్లు రాసినా ఈసీ స్పందించలేదు
- ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి
- ఓటర్ల జాబితాలో అర్హులందరి పేర్లు ఉండాల్సిందే: సుప్రీం
- ఈసీ, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు నోటీసులు
- తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. ‘సర్’ను సవాల్ చేస్తూ మమత దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మమత స్వయంగా వాదనలు వినిపించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ను ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేసింది. రాష్ట్ర ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నది. ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియ ఓటర్లను తొలగించడానికే తప్ప.. నమోదు చేయడానికి కాదు. బతికి ఉన్నోళ్లను చనిపోయినట్టుగా పేర్కొంటూ ఓటర్ జాబితాలో నుంచి వాళ్ల పేర్లను తొలగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఓటర్లకు ప్రూఫ్‌గా ఆధార్ కార్డును ఈసీ అనుమతించడం లేదు. ఆధార్ కాకుండా వేరే డాక్యుమెంట్లు చూపించాలంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఫ్యామిలీ రిజిస్టర్ కార్డు తదితర డాక్యుమెంట్లను అనుమతిస్తున్నారు. కానీ బెంగాల్‌లో మాత్రం వాటిని అనుమతించడం లేదు. కేవలం మా రాష్ట్రాన్నే టార్గెట్ చేశారు. నిజానికి సర్ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండేండ్ల సమయం పడుతుంది. కానీ బెంగాల్‌లో ఎలక్షన్స్‌కు ముందు హడావిడిగా చేపట్టారు. అదీ పండుగలు, పంటల కోత సమయంలో చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని మమత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం బెంగాల్‌నే టార్గెట్ చేశారని, ఇదే విధానాన్ని అస్సాంలో ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.
పార్టీ కోసం కాదు.. ప్రజల కోసం పోరాడుతున్న..
ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టామని తెలిపారు. ‘‘మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈసీకి నేను ఆరుసార్లు లెటర్ రాసినప్పటికీ, వాళ్ల నుంచి స్పందన లేదు. ఇందులో మీరు జోక్యం చేసుకుని సర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడండి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా చూడాలని విన్నవించారు. ‘‘ఈ కేసు కోసం మొదటి నుంచీ మా లాయర్లు కొట్లాడుతున్నారు. కానీ చివరికి మాకు న్యాయం దక్కడం లేదు. నేనొక కార్మికురాలిని.. సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను నా పార్టీ కోసం పోరాడడం లేదు.. ప్రజల కోసం పోరాడుతున్నాను” అని చెప్పారు. చివరగా రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలోని పంక్తులను ప్రస్తావిస్తూ.. ‘‘న్యాయం ఒక మూలన కూర్చొని కన్నీరు కారుస్తున్నది” అని మమత వ్యాఖ్యానించారు. అనంతరం ఈసీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ‘‘ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అర్హులందరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండాల్సిందే” అని స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
5 కాదు 15 నిమిషాలు తీసుకోండి..
ఈ కేసులో మమత తరఫున సీనియర్ అడ్వొకేట్లు కపిల్ సిబల్, శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే విచారణ టైమ్‌లో తాను వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని సీజేఐ బెంచ్‌ను ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘నాకొక 5 నిమిషాలు సమయం ఇవ్వండి చాలు’ అని విన్నవించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ‘‘5 కాదు 15 నిమిషాలు సమయం ఇస్తాం. మీరు చెప్పాల్సింది చెప్పండి” అని అనుమతి ఇచ్చారు.
