- అమెరికా–-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం
- 69 పైసలు బలపడిన రూపాయి
- రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- రూ.5,835 కోట్ల విలువైన షేర్లు అమ్మిన ఎఫ్‌ఐఐలు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు.. మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పుంజుకుని ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయనే వార్తలతో ముడి చమురు ధరలు భారీగా పడడం కలిసొచ్చింది.
సెన్సెక్స్ 941 పాయింట్లు (1.22 శాతం) పెరిగి 77,959 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,005 పాయింట్లు ఎగిసి 78,023 లెవెల్ వరకు చేరింది. నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 24,331 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.473 లక్షల కోట్లకు చేరుకుంది.
తిరుగులేని రికవరీ..
సెన్సెక్స్ ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 76,773 కి పడిపోయినప్పటికీ, అక్కడి నుంచి దాదాపు 1,200 పాయింట్లు రికవర్ అయ్యింది. నిఫ్టీ కూడా 24,000 దిగువ నుంచి 333 పాయింట్లు పుంజుకుంది. చమురు ధరలు తగ్గడంతో విమానయాన సంస్థ ఇండిగో షేర్లు ఏడు శాతం పెరిగి టాప్ గేనర్గా నిలిచింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడా 3–4శాతం లాభపడ్డాయి.
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నికరంగా రూ.5,835 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, చమురు ధరలు అదుపులోకి రావడమే మార్కెట్ లాభాలకు ప్రధాన కారణమని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిఫ్టీకి ప్రస్తుతం 24,000 వద్ద బలమైన మద్దతు ఉందని, నిఫ్టీ విక్స్ ఇండెక్స్ ఏడు శాతం తగ్గడం బుల్లిష్ ట్రెండ్‌కు సంకేతమని సెంట్రమ్ ఫిన్‌వర్స్ ఎనలిస్ట్ నీలేశ్ జైన్ అన్నారు.
మార్కెట్ పెరగడానికి గల కారణాలు.. ముగియనున్న యుద్ధం?
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరిందనే వార్తలతో మార్కెట్ పుంజుకుంది. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని 'ఆక్సియోస్' రిపోర్ట్ వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో ఇరాన్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ వార్తతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి.
ముడి చమురు ధరల పతనం..
యుద్ధం ముగుస్తుందనే ఆశలతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6 శాతం తగ్గి బ్యారెల్‌కు 103 డాలర్లకు, డబ్ల్యూటీఐ క్రూడ్ 7శాతం తగ్గి 95 డాలర్లకు పడిపోయాయి. గత వారమే బ్రెంట్ క్రూడ్ 120 డాలర్ల మార్కును దాటిన విషయం తెలిసిందే.
బలపడిన రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఈ ఏడాది ఏప్రిల్ 2 తర్వాత అత్యుత్తమ ఒకరోజు వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం రూ.95.28 వద్ద ఉన్న రూపాయి, బుధవారం 69 పైసలు పుంజుకుని రూ.94.49 వద్ద ముగిసింది.
