గ్రామస్తులపై జవాన్ల కాల్పులు

గ్రామస్తులపై జవాన్ల కాల్పులు

నాగాలాండ్‌లోని దారుణ ఘటన వెలుగుచూసింది. సాధారణ పౌరులను మిలిటెంట్లు అనుకొని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బొగ్గు గనులలో పనిచేసి ఇంటికి తిరిగివస్తుండగా.. భద్రతా బలగాలు చూశాయి. వారిని మిలిటెంట్లుగా భావించిన బలగాలు.. వారిపై ఒక్కసారిగా కాల్పులకు దిగాయి. దాంతో 13 మంది యువకులు చనిపోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. బలగాల చర్యకు ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు.. మిలటరీకి చెందిన వాహనాలను చుట్టుముట్టి తగులబెట్టారు. దాంతో బలగాలు మరోసారి కాల్పులు జరిపాయి. అయితే గ్రామస్తుల దాడిలో ఓ జవాను చనిపోయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

మోన్ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం నీఫియు రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. ఘటనపై ఉన్నత స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

‘సోమవారం, ఓటింగ్‌లో పౌరుల హత్యకు దారితీసిన దురదృష్టకర సంఘటన తీవ్రంగా ఖండించదగినది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఘటనపై సిట్ అధికారులచే దర్యాప్తు చేయించి.. న్యాయం చేస్తాం’ అని ముఖ్యమంత్రి రియో ​​ట్వీట్ చేశారు.

మోన్ ఘటన పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆదివారం ఉదయం ట్వీట్ చేసి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘నాగాలాండ్‌లోని ఓటింగ్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనపై తీవ్రంగా కలతచెందాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్‌ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతుంది’ అని ట్వీట్ చేశారు.