తెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి 

తెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి 

తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం ( మే 23) సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. గాలివానతో చెట్లుకూలిపోయాయి. కల్లాలు, ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో వానకు తడిసి నష్టం వాటిల్లడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పిడుగుపాటుకు ఓ గొర్రెలకాపరి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. 

రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి,మెదక్, సిద్దిపేట, వికారబాద్ జిల్లాల్లోః వానలు దంచికొట్టాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మల్లయ్య మృతి చెందారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. 

మరోవైపు ఎండల తీవ్రతతో ఉష్ణోగ్రతలు పెరిగి అగ్ని ప్రమాదాలకు దారితీసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి శివారు పంట పొలాల్లో ఆకస్మాత్తుగా  మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి పక్కన గడ్డి కట్టలకు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన చంద్రమౌళి అనే రైతు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.