వైవిధ్యభరిత చిత్రాలతో ముందుకెళ్తున్న సందీప్ కిషన్.. తాజాగా మరో డిఫరెంట్ మూవీకి సైన్ చేశాడు. శనివారం ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇటీవల ‘శంభాల’తో మెప్పించిన దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతోంది. ఈ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీకి సంబంధించి ఓ క్రేజీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సింహం, తోడేలు ఎదురెదురుగా కనిపిస్తుండగా వెనుక యుద్ధభూమితో పాటు పురాతన ఖడ్గం ఉన్నాయి.
‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగిసిపోవు... కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ ఆసక్తి రేపుతోంది. విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించబోతున్నామని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
