డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి బాధితులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఒక సరికొత్త రూలింగ్‌ను తీసుకువచ్చింది. ఆన్లైన్ మోసాల బారిన పడి డబ్బులు నష్టపోయిన ఖాతాదారులకు రూ.25వేల వరకు పరిహారం అందించేలా ఈ నిబంధనలను రూపొందించారు. ఇది సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చే అంశమనే చెప్పుకోవాలి.
కొత్త నిబంధనల ప్రకారం.. మీ తప్పు లేకుండా ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినా, సైబర్ ఫ్రాడ్ జరిగినా తక్షణమే స్పందించడం ముఖ్యం. మోసం జరిగిన 3 రోజుల్లోపు బ్యాంక్‌కు ఫిర్యాదు చేస్తే.. ఆ నష్టానికి మీ బాధ్యత ఏమీ ఉండదు. పూర్తి నష్టాన్ని బ్యాంకే భరిస్తుంది. అయితే ఒకవేళ మీ నిర్లక్ష్యం అంటే UPI పిన్ లేదా పాస్వర్డ్ ఇతరులకు చెప్పడం వల్ల కాకుండా, సిస్టమ్ లోపాల వల్ల మోసం జరిగితేనే ఈ రూ.25వేల వరకు పరిహారం లభించే అవకాశం ఉంటుంది.
►ALSO READ | పోస్టాఫీస్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్: ఆధార్ బయోమెట్రిక్‌తో ఏ బ్రాంచ్ నుంచైనా లావాదేవీలు
ఒకవేళ మీరు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేస్తే పరిహారం తగ్గే అవకాశం ఉంది. మోసం జరిగిన 4 నుండి 7 రోజుల లోపు సమాచారం ఇస్తే.. మీ అకౌంట్ రకాన్ని బట్టి గరిష్టంగా రూ.25వేల వరకు మాత్రమే బ్యాంక్ రీఫండ్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఖాతాదారే భరించాల్సి ఉంటుంది. అందుకే సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ కస్టమర్ కేర్‌కు గానీ, హోమ్ బ్రాంచ్‌కు గానీ సమాచారం అందించడం చాలా అవసరం.
పెరుగుతున్న ఆన్లైన్ నేరాల నుంచి డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. ఈ పరిహారం పొందాలంటే బ్యాంక్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు 1930 నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా ఫిర్యాదు నమోదు చేయాలి. అప్రమత్తంగా ఉండటం, సరైన సమయంలో స్పందించడం ద్వారా మీ కష్టార్జితాన్ని సైబర్ దొంగల బారి నుండి కాపాడుకోవచ్చు.
