- సుచరిత అక్రమాస్తులు రూ.50 కోట్లు
- స్థిరాస్తులు, డైమండ్స్, బంగారం, పెద్ద మొత్తంలో నగదు గుర్తించిన ఏసీబీ
- శామీర్‌పేట్ తహసీల్దార్ హోదాలో 30 ఎకరాల కన్వర్షన్‌కు రూ.30 లక్షలు డిమాండ్
- బ్రోకర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటూ మే 26న చిక్కిన సుచరిత అరెస్ట్, రిమాండ్, సస్పెన్షన్ వేటు
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్‌గా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి తుమ్మకొమ్మ సుచరిత వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. గురువారం ఆమె నివాసంతో పాటు బంధువుల ఇండ్లు సహా మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె నివాసంలో రూ. 12 లక్షల నగదు, రూ. 1.20 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు సహా మొత్తం రూ.5 .5కోట్లు విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రూ. 30 లక్షల లంచం డిమాండ్.. రూ.2 లక్షలతో చిక్కిన సుచరిత
శామీర్‌పేట్ తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సుచరితపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటూ కొందరు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఎకరాకు రూ. లక్ష చొప్పున సుచరిత మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. రైతులు బతిమాలడంతో.. వాయిదాల్లో డబ్బు ఇవ్వాలని దాని ప్రకారమే వ్యవసాయేతర భూమిగా మారుస్తానని స్పష్టం చేశారు. దీంతో బాధిత రైతులు ఏసీబీని ఆశ్రయించారు. మధ్యవర్తి ద్వారా మొదటి విడత రూ.2 లక్షలు తీసుకుంటుండగా మే 26 న సుచరితను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసింది.ఈ ట్రాప్ కేసులో సుచరిత ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలు రిమాండ్‌లో ఉంది.
ఆదాయానికి మించి ఆస్తులు
దర్యాప్తులో భాగంగా సుచరిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులో భాగంగా సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, దామరకుంట గ్రామంలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ గ్రామాల్లోని 2 ప్లాట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. ఇంట్లో సుమారు రూ. 12 లక్షల నగదు, వోక్స్‌వెగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ. 1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ. 38 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తులు మొత్తం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
