అజిత్ పవార్ సహా ఆ11 మందినీ గెంటేశాం

అజిత్ పవార్ సహా ఆ11 మందినీ గెంటేశాం
  • శరద్‌‌ పవార్ వర్గం ఎన్సీపీ ప్రకటన 
  • పార్టీ వర్కింగ్ కమిటీ భేటీలో 8 తీర్మానాలకు ఆమోదం 
  • ఎన్సీపీకి నేనే ప్రెసిడెంట్‌‌ని: శరద్
  • సీఎం కావాలనుకునే వాళ్లతో సమస్య లేదని కామెంట్  
  • శరద్ పవార్ మీటింగ్ ఇల్లీగల్: అజిత్ వర్గం   

ముంబై/న్యూఢిల్లీ: ఎన్సీపీలో బాబాయ్–అబ్బాయ్‌‌ల మధ్య వైరం ముదురుతున్నది. రోజుకో కొత్త టర్న్ తీసుకుంటున్నది. పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా మొత్తం11 మంది నేతలను శరద్‌‌ పవార్‌‌‌‌ ఆధ్వర్యంలోని ఎన్సీపీ బహిష్కరించింది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీకి తానే ప్రెసిడెంట్‌‌ని అని శరద్‌‌ పవార్ మరోసారి స్పష్టం చేశారు. ఎవరో ఏదో అంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదన్నారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత పార్టీ నేత పీసీ చాకో మీడియాకు వివరాలను వెల్లడించారు. శరద్‌‌ పవార్‌‌‌‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించామని, 8 తీర్మానాలను ఆమోదించామని చెప్పారు. 

 చెప్పాల్సింది ఈసీకే చెప్తాం 

‘‘పార్టీకి నష్టం వాటిల్లింది. అయితే ఇది పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తుందని నేతలు చెబుతున్నారు. ఎవరైనా సీఎం కావాలని అనుకుంటే.. అందులో నాకెలాంటి సమస్యా లేదు. వాళ్లకు నా ఆశీస్సులు ఇస్తాను. చెప్పాల్సింది ఏదైనా ఉంటే.. అది ఎన్నికల సంఘం ఎదుటే చెబుతాం. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను కేంద్రం ఉపయోగిస్తోంది” అని శరద్ పవార్ మండిపడ్డారు. తన వయసుపై అజిత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘82 లేదా 92 కావచ్చు.. వయసు అనేది పెద్ద విషయం కాదు.. నేను ఎఫెక్టివ్ గానే ఉన్నా” అని అన్నారు. అజిత్‌‌ మోసం చేశారని భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘లేదు.. పార్టీయే సర్వోన్నతం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా’’ అంటూ సెటైర్లు వేశారు. గతంలో అజిత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఇలా ప్రస్తావించారు.

శరద్‌‌ను కలిసిన రాహుల్

ఎన్సీపీ వర్కింగ్ కమిటీ మీటింగ్ తర్వాత ఢిల్లీలోని శరద్‌‌పవార్‌‌‌‌ నివాసంలో ఆయన్ను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కలిశారు. ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో శరద్‌‌కు మద్దతు తెలిపారు. ఇద్దరు నేతలు కొద్ది సేపు మాట్లాడుకున్నారు.   

శరద్ మీటింగ్ కు చట్టబద్ధత లేదు: అజిత్ వర్గం 

ఎన్సీపీ నిర్వహించిన సమావేశం ఇల్లీగల్‌‌ అని అజిత్ పవార్ వర్గం మండిపడింది. ‘‘పార్టీ విషయంలో ఉన్న వివాదాన్ని ఈసీఐ పరిష్కరించేదాకా నేషనల్ ఎగ్జిక్యూటివ్/ నేషనల్ వర్కింగ్ కమిటీ/ నేషనల్ ఆఫీస్ బేరర్స్/ స్టేట్ ప్రెసిడెంట్స్ తదితర ఎలాంటి మీటింగ్స్ నిర్వహించే అధికారం పార్టీలో ఎవ్వరికీ లేదు” అని స్పష్టం చేసింది. శరద్ పవార్ నిర్వహించిన సమావేశానికి చట్టబద్ధత లేదని, జూన్‌‌ 30వ తేదీనే తమ చీఫ్‌‌గా అజిత్‌‌ను ఎన్నుకున్నామని తేల్చి చెప్పింది.  

అజిత్‌‌ను కట్టప్పతో పోల్చుతూ పోస్టర్లు 

ఢిల్లీలోని ఎన్సీపీ ఆఫీసు ఎదుట ఆ పార్టీ స్టూడెంట్ వింగ్ నేతలు ‘కట్టప్ప’ పోస్టర్‌‌‌‌ను పెట్టారు. అజిత్‌‌ ‘గదర్‌‌ (ద్రోహి)’ అంటూ బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచే ఫొటోను పెట్టారు. బాహుబలి ప్లేస్‌‌లో శరద్‌‌ పవార్, కట్టప్ప ప్లేస్‌‌లో అజిత్ ఉన్నట్లుగా చూపారు. అజిత్‌‌, ప్రఫుల్‌‌ పటేల్ ఉన్న పాత పోస్టర్లను తొలగించారు. అయితే కట్టప్ప పోస్టర్లను ఢిల్లీ మున్సిపల్ నేతలు తొలగించారు. 

అసంతృప్తేం లేదు: షిండే

 

రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్‌‌ చేరికపై శివసేనలో ఎవ్వరూ అసంతృప్తితో లేరని మహారాష్ట్ర సీఎం ఏక్‌‌నాథ్ షిండే అన్నారు. బీజేపీ–శివసేన (షిండే) కూటమిలోకి అజిత్ వర్గం రాకతో తన సీఎం కుర్చీ ప్రమాదంలో పడొచ్చని వస్తున్న వార్తలు ప్రతిపక్షాల పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘మేం రాజీనామా ఇచ్చే వాళ్లం కాదు.. తీసుకోనేవాళ్లం. అందరినీ తన వెంట తీసుకెళ్లడం, ఓపికతో ఉండటమే షిండే నాయకత్వం” అని శివసేన (షిండే) నేత ఉదయ సామంత్ అన్నారు.