అమెరికా, ఇరాన్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉండటంతో ఈరోజు (6 మే 2026) ముడి చమురు ధరలు తగ్గాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లు పెరగగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 24,200 మార్కును దాటింది. ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 288.55 పాయింట్లు (0.37%) పెరిగి 77,306.34 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 104.30 పాయింట్లు (0.43%) పెరిగి 24,137.10కి చేరుకుంది. అయితే నిన్న మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియగా... 95.28 వద్ద ముగిసిన రూపాయి, డాలర్‌తో పోలిస్తే 0.26% పెరిగి ఉదయం 95.03 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్ స్టాక్‌లలో ఇండిగో అత్యధికంగా 2.35% లాభాన్ని నమోదు చేసింది. బజాజ్ ఫైనాన్స్ , మహీంద్రా & మహీంద్రా, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ట్రెంట్, టాటా స్టీల్ షేర్స్ కూడా మంచి లాభాలను చూడగా.. మొత్తం 27 స్టాక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు, పవర్‌గ్రిడ్, హిందుస్థాన్ యూనిలివర్, లార్సెన్ & టూబ్రో షేర్స్ క్షీణించాయి.
విస్తృత మార్కెట్‌లో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.91% లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1.01% లాభపడింది. సెక్టోరల్ వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ అత్యధికంగా లాభపడ్డాయి. మరోవైపు, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ కన్‌స్ట్రక్షన్ డ్యూరబుల్స్ క్షీణించాయి.
స్టాక్ మార్కెట్ పెరుగుదలకి కారణం
హోర్ముజ్ జలసంధిలో నౌకలను సురక్షితంగా తరలించేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందా లేదా అని అంచనా వేస్తున్నందున దీనిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా, ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 1.55 శాతం తగ్గి, బ్యారెల్‌కు 108.2 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
