- రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడం ఆందోళనకరం
- ‘కాఫీ విత్ ఎ కాప్’లో డీజీ శిఖా గోయల్
గచ్చిబౌలి, వెలుగు: ప్రస్తుత సమాజంలో ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని టీజీసీఎస్బీ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా గరువారం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సత్వ నాలెడ్జ్ పార్క్లో ఐటీ ఉద్యోగుల కోసం “కాఫీ విత్ ఎ కాప్” అనే ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా శిఖా గోయల్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల నిబంధన కాదని, అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల మంది రోడ్డు ప్రమాదాల్లోనే మరణించడం విచారకరమన్నారు. జరిమానాల కోసం కాకుండా, ప్రాణ రక్షణ కోసం స్వచ్ఛందంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేశ్ మాట్లాడుతూ.. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా 18 నుంచి 35 ఏండ్ల లోపు యువతే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతుండటం ఆందోళనకరమన్నారు.
అవగాహన స్టాల్స్
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, మహిళల భద్రతా విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఫిషింగ్, ఆన్లైన్ మోసాల పట్ల ఐటీ ఉద్యోగులను అప్రమత్తం చేయగా, కార్యక్రమంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీలు శేషాద్రి రెడ్డి, రంజన్ రతన్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

