మూడు పెళ్లిళ్లు.. మూడు నో బాల్స్: మాలిక్‌ను ఆడుకుంటున్న నెటిజన్స్

మూడు పెళ్లిళ్లు.. మూడు నో బాల్స్: మాలిక్‌ను ఆడుకుంటున్న నెటిజన్స్

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ మోడల్, నటి అయిన సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. వీరి పెళ్లి ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మాలిక్ కు ఇది మూడో పెళ్లి. 2010లో మొదట భార్య అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్ అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా సానియాకు విడాకులు ఇచ్చి పాకిస్థాన్ మోడల్ ను పెళ్లి చేసుకున్నాడు. 

ఇదంతా తెలిసిన విషయమే అయినా ప్రస్తుతం మాలిక్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 (BPL 2024) సీజన్‌లో భాగంగా ఖుల్నా టైగర్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో ఫార్చ్యూన్ బరిషల్ తరపున మాలిక్ ఆడుతున్నాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ వేయడానికి వచ్చిన మాలిక్.. ఒక ఓవర్ లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఈ మాజీ పాక్ ఆటగాడు నో బాల్స్ ధాటికి నాన్ స్ట్రైకర్ లో ఉన్న బ్యాటర్ అసలు రన్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఏకంగా క్రీజ్ కు చాలా దూరంలో ఉన్నాడు. మొత్తం ఈ ఓవర్ లో 18 పరుగులు వచ్చాయి.
 
మాలిక్ 3 నో బాల్స్ వేయడంతో నెటిజన్స్ ఇతడిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. మాలిక్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అందుకే మూడు నో బాల్స్ వేసాడంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తన మూడో పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చాడంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఫార్చ్యూన్ బరిషల్ జట్టుపై  ఖుల్నా టైగర్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అనామల్ హక్ (63) ఏవీన్ లూయిస్ (53) హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ను గెలిపించారు. మాలిక్ 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి నాటౌట్ గా నిలిచాడు.