Shoaib Malik: సరదా తీరాక వదిలేయటమే.. షోయబ్ మాలిక్ పెళ్లి జీవిత ఘట్టాలు

Shoaib Malik: సరదా తీరాక వదిలేయటమే.. షోయబ్ మాలిక్ పెళ్లి జీవిత ఘట్టాలు

పెళ్లాడటం.. కొన్నాళ్లు కాపురం చేయటం.. ఆ సరదా తీరాక విడాకులిచ్చి మరొకరిని మనువాడటం.. ఇదీ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వ్యవహారం. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఈ పాక్ క్రికెటర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 

మొదట అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్.. 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గత రెండేళ్లుగా షోయబ్, సానియా విడాకుల గురించి వార్తలు వచ్చాయి. అయితే వాటిపై వీరిద్దరూ స్పందించిందిలేదు. పైగా ఆ వార్తలను టీవీ షో ప్రమోషన్స్ కోసం అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి తమ కుమారుడు ఇజాన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఇంతలోనే ఏమయ్యిందో కానీ, షోయబ్ మరొకరిని మనువాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

గతేడాది సనా జావేద్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షోయబ్.. ఆమెతో అప్పట్నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సనా ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. ఆమెకు ఇదివరకే పెళ్ళైనట్లు సమాచారం.

విడాకుల గురించి సానియా పోస్ట్

రెండ్రోజుల క్రితమే సానియా మీర్జా తన వైవాహిక జీవితం గురించి ఒక ఆసక్తికర పోస్టును తన ఇన్‌స్టాస్టోరీలో పంచుకుంది.  అందులో విడాకులు, వివాహానికి సంబంధించిన కొన్ని విశేషాలను హైలైట్ చేసింది. "వివాహం కష్టం, విడాకులు తీసుకోవడం కష్టం.. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి.. స్థూలకాయం కష్టం, ఫిట్ గా ఉండడం కష్టం.. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. అప్పులు చేయడం కష్టం, ఆర్థిక క్రమశిక్షణతో ఉండడం కష్టం.. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో.." అంటూ సొంత నిర్ణయాలు తీసుకునేలా పాఠకులను ప్రేరేపించడానికి ఉద్దేశించబడిన ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుతోనే వీరిద్దరి విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, రేపో.. మాపో మేమిద్దరం విడిపోయామంటూ ఈ జోడి ప్రకటన చేస్తుందని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. వారు చెప్పినట్లుగానే గంటల వ్యవధిలోనే షోయబ్.. తన కొత్త భార్యను ప్రపంచానికి పరిచయం చేశాడు.