శుభక్షేత్ర పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డ రియట్ ఎస్టేట్ సంస్థ ప్రధాన నిందితుడు రామావత్ మధును సైబరాబాద్ EOW పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా దామరగిడ్డ గ్రామంలో ప్రాజెక్ట్ ఉందంటూ, DTCP అప్రూవ్డ్ లేఅవుట్ పేరుతో తప్పుడు ప్రచారం చేసి.. సుమారు 130 మందిని నిందితులు నమ్మబలికారు. కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో 102 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా.. నెలకు 25 వేల రూపాయల చొప్పున 42 నెలల పాటు భారీ లాభాలు ఇస్తామంటూ ప్రలోభపెట్టారు. అంతేకాదు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందని మాయమాటలు చెప్పి దాదాపు 12 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు.
ప్రారంభంలో కొంతకాలం రిటర్న్స్ ఇచ్చి నమ్మకం కలిగించిన నిందితులు.. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టారు. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో సంస్థ ఎలాంటి భూమిని కొనుగోలు చేయలేదని, అభివృద్ధి కూడా చేయలేదని తేలింది. రామావత్ మధుపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో సింగర్ మంగ్లీ ప్రస్తావన వినిపించినప్పటికీ.. ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.
నిన్న మియాపూర్‌లో మధును అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు గచ్చిబౌలి కమిషనరేట్ నుంచి ఎల్బీనగర్ కోర్టుకు తరలించారు. ఈ కేసులో మధుతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదవ్వగా పరారీలో ఉన్న వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. అధిక లాభాల పేరుతో వచ్చే రియల్ ఎస్టేట్ స్కీమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. పెట్టుబడి పెట్టే ముందు సంస్థ నిజస్వరూపాన్ని తనిఖీ చేయాలని సూచించారు. అనుమానాస్పద స్కీమ్స్ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

