సింగరేణిలో వారసులకు జాబ్స్ : డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణిలో వారసులకు జాబ్స్ : డిప్యూటీ సీఎం భట్టి
  • సింగరేణిలో వారసులకు జాబ్స్
  • సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి: డిప్యూటీ సీఎం భట్టి 
  • గత బీఆర్ఎస్ హయాంలో మెడికల్ బోర్డులో భారీగా అక్రమాలు 
  • ప్రజా ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో 2,657 పోస్టులను భ‌‌‌‌ర్తీ చేశాం
  • నేడు 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో అర్హులైన వారికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే, సంస్థలో మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో మెడికల్ బోర్డులో భారీగా అక్రమాలు జరిగాయని, ఏసీబీ, విజిలెన్స్ ఎంక్వైరీలతో 2023లో వారసత్వ ఉద్యోగాలిచ్చే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. సింగరేణిలో ఇటీవల కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని ప్రజా భవన్‌‌‌‌లో సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమై, మాట్లాడారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్నిఆయన ఆదేశించారు. ఇటీవల సింగరేణి అభివృద్ధిపై కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారన్నారు. మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. 

మారుపేర్ల అంశంపై సర్కారు దృష్టి.. 


సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపుప్రజా ప్రభుత్వం కొలువుదీరిన త‌‌‌‌ర్వాత సింగ‌‌‌‌రేణిలో 2,657 పోస్టులను భ‌‌‌‌ర్తీ చేశామని చెప్పారు. వీటిలో 555 ఎక్స్‌‌‌‌టర్నల్ పోస్టులు ఉండ‌‌‌‌గా, 2,102 కారుణ్య నియామ‌‌‌‌క ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కారుణ్య నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచడం ద్వారా ఇప్పటికే 200 మంది లబ్ధి పొందారని ఆయన తెలిపారు.

గత రెండేండ్లలో రూ.1,500 కోట్లను లాభాలను వాటా రూపంలో కార్మికులకు చెల్లించినట్లు వెల్లడించారు. ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, డిపెండెంట్ పిల్లల వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఉద్యోగుల కోసం అన్ని ఏరియా ఆస్పత్రులను ఆధునీకరణ చేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్‌‌‌‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశా నైనీ బ్లాక్ అనుమతులతో పాటు బొగ్గు ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వంలో తీసుకున్న ప్రత్యేక చొరవను ఆయన గుర్తుచేశారు.