సింగరేణి -కార్మికులకు లాభాల్లో వాటా

సింగరేణి -కార్మికులకు లాభాల్లో వాటా
  • బ్యాంకు అకౌంట్లలో రూ.711 కోట్లు జమ చేసిన యాజమాన్యం 
  • నేడు దసరా పండుగ అడ్వాన్సు పంపిణీ
  • టోకెన్​ సమ్మె విరమించుకున్న ఏఐటీయూసీ

కోల్​బెల్ట్​,వెలుగు: 2022-–23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన లాభాల్లో కార్మికుల వాటా 32 శాతం కింద  రూ.711 కోట్లను ఎట్టకేలకు యాజమాన్యం విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని ఉద్యోగులు, కార్మికుల  బ్యాంకు ఖాతాల్లో లాభాల వాటా మొత్తాన్ని జమచేసింది. దసరా పండుగ అడ్వాన్స్ ఒక్కో కార్మికుడికి ​ రూ.25వేల చొప్పున శనివారం అకౌంట్లలో  జమచేయనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో  తెలిపింది. ఈ నెల 16న కార్మికుల లాభాల వాటా చెల్లించాల్సి ఉండగా, 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. దీనిని సాకుగా చూపుతూ యాజమాన్యం  వాటా చెల్లింపు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  దీంతో సింగరేణి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 20న కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్​ ఆఫీస్​ ఎదుట దీక్ష చేపట్టగా, 21న ఒక రోజు టోకెన్​ సమ్మెకు ఏఐటీయూసీ పిలుపునిచ్చింది.   

కార్మిక సంఘాల ఒత్తిడి నేపథ్యంలో యాజమాన్యం  విషయాన్ని ప్రిన్సిపల్​ సెక్రటరీ, ఎన్నికల కమిషనర్​ దృష్టికి తీసుకవెళ్లగా, లాభాల్లో వాటా ముందుగా ప్రకటించినందున చెల్లింపులకు ఎలాంటి అభ్యంతరం లేదని  వెల్లడించినట్లు తెలిసింది. దీంతో 20, 21వ తేదీల్లో లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్​ చెల్లింపుపై నిర్ణయం తీసుకుంది.  శుక్రవారం లాభాల వాటా మొత్తం రూ.711 కోట్లు సుమారు 39,600  మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. లాభాల వాటా, దసరా అడ్వాన్సు చెల్లించాలని అన్ని కార్మిక సంఘాలు కలిసి పోరాటాలు చేశాయని, లాభాల వాటా చెల్లింపు కార్మికుల విజయమని ఏఐటీయూసీ, బీఎంఎస్​, హెచ్​ఎంఎస్​, సీఐటీయూ, ఐఎన్టీయూసీ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, యాదగిరి సత్తయ్య, రియాజ్​ఆహ్మద్​, రాజిరెడ్డి, జనక్​ప్రసాద్​ తెలిపారు.  శనివారం సింగరేణిలో నిర్వహించనున్న ఒక రోజు టోకెన్​ సమ్మెను విరమించుకుంటున్నట్లు ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు.