రైతుల లెక్క కొట్లాడతం.. సింగరేణి కార్మికుల హెచ్చరిక

రైతుల లెక్క కొట్లాడతం.. సింగరేణి కార్మికుల హెచ్చరిక

హైదరాబాద్: సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగారు. TBGKS నాయకత్వంలో శ్రీరాంపూర్ ఏరియా RK5, 5B ఉద్యోగులు గని గేటు దగ్గర బైటాయించి  నిరసన తెలిపారు. సింగరేణి సంస్థను ప్రయివేటు పరం చేయకూడదని కార్మికులు నినాదాలు చేశారు. మూడు బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మూడ్రోజుల పాటు జరిగే సమ్మెలో ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

సమ్మెలో భాగంగా కార్మికులు ఇవాళ ఉదయం నుంచి తమ విధులకు పూర్తిగా హాజరుకాలేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. TBGKS తోపాటు AITUC, INTUC, BMC, CITU వంటి జాతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఉదయం మొదటి షిప్ట్  నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. ఈ సమ్మెలో సుమారు 40 వేల మందికిపైగా సింగరేణి కార్మికులు, మరో 25వేల మంది వరకు ఔట్ సోర్సింగ్  సిబ్బంది పాల్గొంటున్నారు. కొన్ని గనుల్లో కార్మికులు ర్యాలీలు తీశారు. 

వెనక్కి తగ్గకపోతే ఢిల్లీలో ఆందోళన

సింగరేణి కేకే6లో 70 మిలియన్  టన్నులు, సత్తుపల్లి బ్లాక్ 3లో 60 మిలియన్ టన్నులు, శ్రావణపల్లిలో 200 మిలియన్ టన్నులు, కేవోసీ బ్లాక్ 3లో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటిని వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే 4 బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ లను ప్రైవేటీకరిస్తే సింగరేణికి భవిష్యత్ ఉండదంటున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే, ఢిల్లీలో రైతులు చేసిన విధంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

సమ్మె కొనసాగితే భారీ నష్టం

సింగరేణిలో మూడ్రోజుల పాటు సమ్మె కొనసాగితే బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడనుంది. రోజుకు దాదాపు 2 లక్షల టన్నుల ఉత్పత్తి నిలిచిపోనుంది. వివిధ గ్రేడుల బొగ్గు ఒక్కో ధరకు అమ్ముతున్నా.. సగటున టన్ను 3 వేల 200 రూపాయలు పలుకుతోంది. రోజుకు 60 కోట్ల చొప్పున 3 రోజులకు సింగరేణికి 180 కోట్లు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. 43 వేల మంది కార్మికులు జీతాల రూపంలో 60 కోట్ల వరకు నష్టపోనున్నారు.