తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ల పర్సంటేజ్ సెగలు రేపుతోంది. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న గిల్డ్ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేడు గట్టిగా రియాక్ట్ అయ్యింది. కొంతమంది నిర్మాతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐసీయూలో సింగిల్ స్క్రీన్లు ..
థియేటర్లు బాగుండటం లేదు.. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని నిర్మాతలు చేసిన విమర్శలపై ఎగ్జిబిటర్లు నిప్పులు చెరిగారు. మా పరిస్థితి ఐసీయూలో ఉన్న రోగిలా ఉంది. ఒకప్పుడు తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్స్ ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 400కు పడిపోయింది. థియేటర్లను ఆధునీకరించడానికి మేము సిద్ధమే, కానీ మనుగడ సాగించడానికి ఆదాయం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. మేము అడుతున్న పర్సంటేజ్ డిమాండ్ కొత్తది కాదని చెప్పుకొచ్చారు.
మల్టీప్లెక్స్‌లకు ఒక రూల్.. మాకో రూలా?
2008 నుంచి ఈ పోరాటం చేస్తున్నామని, 'హరిహర వీరమల్లు' సమయం నుంచి హామీలు ఇస్తున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని సెక్రటరీ శ్రీధర్ మండిపడ్డారు. మల్టీప్లెక్స్‌లకు ఇచ్చే పర్సంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్లకు ఎందుకు అమలు చేయడం లేదని వారు నిలదీశారు. కేవలం 'పెద్ది' సినిమా కోసమే ఈ రచ్చ చేస్తున్నామన్న వాదనలో నిజం లేదని, ఇది మా బతుకుదెరువు పోరాటమని స్పష్టం చేశారు. "పెద్ద సినిమా పేరు చెప్పి మా పీక నొక్కుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే 6 నెలలు థియేటర్లు మూసివేయడానికైనా వెనకాడం అని బాల గోవింద్ హెచ్చరించారు.
►ALSO READ | Ram Charan: ' పెద్ది' పవర్ ప్లే టూర్ షురూ: 8 రోజులు.. 7 నగరాలు.. రామ్ చరణ్ మాస్ ప్రమోషన్ ప్లాన్!
రేపు ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక భేటీ!
నిర్మాతలు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ రంగంలోకి దిగారు. వారితో రేపు ( మే 15, 2026 ) తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో కీలక సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునిల్ తో కలిసి వచ్చిన సి. కళ్యాణ్ ఎగ్జిబిటర్లతో చర్చించారు. రేపు ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ చర్చల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని, పరిశ్రమను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యతని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి రేపటి మీటింగ్‌లో ఈ పర్సంటేజ్ పీటముడి వీడుతుందో లేదో చూడాలి.
