అంపైర్ వైపు దూసుకెళ్లిన సిరాజ్ త్రో.. క్షణాల్లో ప్రాణాలని రక్షించుకున్న పాక్ రిఫరీ

అంపైర్ వైపు దూసుకెళ్లిన సిరాజ్ త్రో.. క్షణాల్లో ప్రాణాలని రక్షించుకున్న పాక్ రిఫరీ

Mohammed Siraj Throw: శ్రీలంకతో గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో ప్రతి పరుగు కీలకమే కావడంతో ఫీల్డింగ్ చేసే జట్టు ఆటగాళ్లు నిరంతరం ఒత్తిడి పెంచుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి వాతావరణంలోనే భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ విసిరిన ఒక త్రో రాకెట్ వేగంతో నేరుగా అంపైర్ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనతో గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ తో పాటు మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

రివర్స్ స్వీప్‌కు సిరాజ్ కౌంటర్ త్రో: 

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆడుతుండగా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 69వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ ఓవర్ మొదటి బంతిని క్రీజులో ఉన్న లంక బ్యాటర్ సోనాల్ దినూష రివర్స్ స్వీప్ ఆడగా, బంతి వేగంగా డీప్ పాయింట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్ వెంటనే అప్రమత్తమై బంతిని అందుకున్నాడు. బ్యాటర్లు వేగంగా 2 పరుగులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో, సిరాజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు బలంగా విసిరాడు.

►ALSO READ | 284కే శ్రీలంక ఆలౌట్.. 178 పరుగుల లీడ్‌లో భారత్.. గాలేలో టీమిండియా జోరు!

ఆ బంతి రాకెట్ వేగంతో నేరుగా లెగ్ సైడ్  నిల్చున్న పాకిస్థాన్ అంపైర్ ఎహ్సాన్ రజా వైపు వెళ్ళింది. బంతి గాల్లో తన తల వైపు దూసుకురావడాన్ని గమనించిన ఆయన అద్భుతమైన రిఫ్లెక్సెస్ చూపించి, ఏమాత్రం ఆలోచించకుండా తల దించుకుని ఒక్కసారిగా కిందకు వంగాడు. దీంతో బంతి ఆయన తల పైభాగం నుంచి క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా వెళ్ళిపోయింది. ఒకవేళ రజా సెకను ఆలస్యం చేసినా, ఆ త్రో ధాటికి రజా తలకు తాకి పెద్ద ప్రమాదమే జరిగేది.

ఊపిరి పీల్చుకున్న భారత జట్టు: 

ఈ ఊహించని పరిణామాన్ని చూసి బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజాతో పాటు ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లందరూ ఓ క్షణం అలాగే షాక్‌లో నిలిచిపోయారు. తాను విసిరిన త్రో అంపైర్ వైపు వెళ్లడం చూసి సిరాజ్ సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కానీ అంపైర్ సమయస్ఫూర్తితో సేఫ్ గా బయటపడటంతో గ్రౌండ్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ త్రోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.