చిన్న కాళేశ్వరం పనులు స్పీడప్..BRS హయాంలో పదేండ్లు ఆగిపోయిన పనులు..రెండేళ్లుగా పనుల్లో కదలిక

చిన్న కాళేశ్వరం పనులు స్పీడప్..BRS హయాంలో పదేండ్లు ఆగిపోయిన పనులు..రెండేళ్లుగా పనుల్లో కదలిక
  • రూ.166.67 కోట్లతో భూసేకరణకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం

 జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. పనులను త్వరగా పూర్తి చేసి తలాపున ఉన్న పొలాలకు సాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 18 ఏళ్ల క్రితం అప్పటి  ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ ఊపిరి పోసింది.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చొరవతో ఇటీవల పనుల్లో కదలిక వచ్చింది. ప్రాజెక్టు పూర్తైతే కాటారం డివిజన్‌‌లోని ఐదు మండలాల్లో సుమారు 45 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

రూ.750 కోట్ల వ్యయంతో..

2008లో మహదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద రూ.571 కోట్ల అంచనాతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 45 వేల ఎకరాలకు 4.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించారు. బీరసాగర్, కాటారం వద్ద పంప్ హౌజ్‌‌లు, 132/11 కేవీ విద్యుత్ సబ్‌‌స్టేషన్, గ్రావిటీ కాల్వల నిర్మాణం చేపట్టి సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే భూసేకరణ సమస్యలు, నిధుల కొరతతో మిగిలిన పనులు నిలిచిపోయాయి.

ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.750 కోట్లకు సవరించి పనులను వేగవంతం చేశారు. టెండర్ విలువ రూ.499.33 కోట్లలో ఇప్పటివరకు రూ.350 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.150 కోట్ల పనులు పెండింగ్‌‌లో ఉన్నాయి. ప్రాజెక్టు కోసం మొత్తం 2,427 ఎకరాల భూమి అవసరముండగా 1,020 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. మిగిలిన 1,407 ఎకరాల భూసేకరణ కొనసాగుతోంది.

భూసేకరణకు రూ.166.67 కోట్లు..

భూసేకరణ కోసం రాష్ట్ర కేబినెట్ ఇటీవల రూ.166.67 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. బీరసాగర్ వద్ద అప్రోచ్ కెనాల్ రక్షణ గోడలు, గేట్ల నిర్మాణం, కాటారం స్టేజ్–2 పంప్ హౌజ్ వద్ద కాలువలు, మత్తడి పనులు కొనసాగుతున్నాయి. 14 చెరువుల మరమ్మతులతో పాటు సమీప చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపడుతున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

భూ సర్వే చివరి దశకు చేరుకుంది


చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.అవసరమైన భూమి కోసం రైతులతో ప్రతీ వారం సమీక్ష చేపడుతున్నారు. ల్యాండ్​ సర్వే చివరి దశకు చేరుకుంది. పిల్ల కాల్వలకు భూములు ఇచ్చిన రైతులకు పేమెంట్ చేస్తున్నాం. పనుల్లో వేగం పెరిగింది.

- టి. రమేశ్​బాబు, ఈఈ, మహదేవపూర్​ డివిజన్ 2-