కిలో టమాటా రూ.180.. ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు ధర

కిలో టమాటా రూ.180..   ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు ధర

కిలో టమాటా రూ.180
ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు ధర        
కూరగాయల రేట్లకు రెక్కలు.. జనానికి తిప్పలు 
సిండికేట్‌‌‌‌గా మారిన వ్యాపారులు.. పట్టించుకోని అధికారులు
టమాటా ధర మరింత పెరిగే చాన్స్‌‌‌‌ ఉందన్న వ్యాపారులు

ఆసిఫాబాద్, వెలుగు : రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు వాటిని కొనాలంటే భయపడుతున్నారు. ప్రతి కూరగాయ కిలో 50 రూపాయలకు తక్కువ లేదు. కొన్నైతే వంద దాటేశాయి. టమాటా ఏకంగా కిలో రూ.120 నుంచి రూ.150 దాకా పలుకుతుంది. ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలోని చిరు వ్యాపారులు కిలో టమాటాను 180 రూపాయలకు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రంలో కిలో రూ.120 ఉంటే, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో రూ.140 నుంచి రూ.150 ఉంది. గ్రామాలు, మండల కేంద్రాల్లో ధర మరింత పెంచి అమ్ముతున్నారు. 

ఆదివారం జిల్లాలోని కౌటల మండల కేంద్రంలో కిలో టమాటాను 180 రూపాయలకు విక్రయిస్తున్నారు. సోమవారం నుంచి ఈ రేటు మరింత పెరిగే చాన్స్‌‌‌‌ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరిగి కూరగాయలు కొనలేక జనాలు ఇబ్బందులు పడుతుంటే.. వాటి నియంత్రణపై మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టడం లేదు. కూరగాయల ధరలతో పాటు నిత్యవసర ధరలు కూడా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో రూ.100 పెట్టి కూరగాయలు కొంటే రెండు, మూడ్రోజులకు సరిపోయేవి. ఇప్పుడు ఏది కొనాలన్న కిలో 100 రూపాయల పైనే ఉంటున్నాయి. 

ధరల నియంత్రణ ఏది?

రోజురోజుకు కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. ధరలు ఇంతలా పెరుగుతున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. దళారులే దోచుకు తింటున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో కూరగాయల ధరల పెరుగుదలకు వ్యాపారుల సిండికేటే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలను వ్యాపారులు తక్కువ ధరలకు కొని, జనాలకు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. మరోవైపు మహారాష్ట్ర, ఏపీ నుంచి తెప్పిస్తున్న టమాటాకు కూడా రేటు పెంచి విక్రయిస్తున్నారు. ఇక్కడ కూరగాయల వ్యాపారులే ధరలు నిర్ణయిస్తారు. వాళ్లు చెప్పిన రేటుకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కిలో టమాటా రూ.150 అమ్ముతున్నం..

మాకు కౌటల బస్టాండ్ వద్ద చిన్న కూరగాయల దుకాణం ఉంది. గత వారం రోజులుగా టమాటా రేటు బాగా పెరిగింది. ఇప్పుడు కిలో రూ.150 అమ్ముతున్నం. పెద్ద మార్కెట్‌‌‌‌లో 20 నుంచి 23 కిలోల టమాటా బాక్స్‌‌‌‌కి రూ.3 వేల నుంచి రూ.3,500 పెట్టి కొంటున్నం. పెట్టెలో కొన్ని టమాటాలు చెడిపోయి వస్తున్నాయి. అందుకే రేటు పెంచుతూ అమ్ముతున్నాం. రేటు పెరగడంతో గిరాకీ తగ్గింది.

- ‌‌‌‌‌‌‌‌ వెంకట లక్ష్మి, చిరు వ్యాపారి, కౌటల

రేట్లు చూస్తే భయమైతాంది..

పది రోజులుగా కూరగాయల రేట్లు మండిపో తున్నయ్. ఏది కొనాలన్నా భయమైతాంది. ప్రభుత్వం కూరగాయల రేట్లు తగ్గించాలి.

- చెన్నూరి ఈశ్వరి, గృహిణి, సిర్పూర్ టీ