సాఫ్ట్​వేర్ జాబ్ వదులుకొని గాడిదలు పెంచుతున్నడు

సాఫ్ట్​వేర్ జాబ్ వదులుకొని గాడిదలు పెంచుతున్నడు

బెంగళూరు దగ్గర్లోని రామనగరలో ఉంటాడు శ్రీనివాస్. బిఏ చదివాక సాఫ్ట్​వేర్ కోర్స్ చేశాడు. కొన్నేండ్లు ఐటీ కంపెనీలో పనిచేశాడు. అయితే లాక్​డౌన్​ టైమ్​లో వర్క్​ఫ్రమ్​హోమ్ ఇవ్వడంతో సొంతూరు వచ్చేశాడు​. అప్పుడే అతనికి వ్యవసాయం చేయాలని అనిపించింది. దాంతో రెండేండ్ల కిందట రెండున్నర ఎకరాల స్థలంలో మేకలు, కడక్​నాథ్​ కోళ్లు, కుందేళ్లు పెంచడం మొదలుపెట్టాడు శ్రీనివాస్. 

దేశంలోనే రెండోది

అదే టైంలో తమ ప్రాంతంలో మేత దొరక్క గాడిదలు బక్కచిక్కిపోవడం గమనించాడు శ్రీనివాస్.  అందుకు కారణం ఏంటని ఆలోచిస్తే... బట్టలు ఉతకడానికి ఇప్పుడు చాలామంది వాషింగ్ మెషిన్లు వాడుతున్నారు. మరికొందరు లాండ్రీ షాపులో ఇస్తున్నారని తెలిసింది. దాంతో,  బట్టలు ఉతకడమే ఉపాధిగా ఉన్న కుటుంబాలు... బట్టల మూటల్ని మోసే గాడిదల పెంపకం తగ్గించాయి. దాంతో గాడిదలకు తిండి దొరకడం కష్టమైంది. రానురాను వాటి సంఖ్య  తగ్గడం మొదలైంది. మిగతా జంతువుల లెక్కనే గాడిదలకు కూడా మంచి తిండి, షెల్టర్​ ఏర్పాటు చేయాలి అనుకున్నాడు శ్రీనివాస్. అందుకోసం జూన్ 8న డాంకీ ఫామ్ ఏర్పాటు చేశాడు.  ఇది కర్నాటకలో మొదటి డాంకీ ఫామ్. మనదేశంలో రెండోది. కేరళలోని ఎర్నాకుళంలో మొదటగా డాంకీ ఫామ్ ఉంది. శ్రీనివాస్ డాంకీ ఫామ్​లో ఇప్పుడు 20కి పైగా గాడిదలు ఉన్నాయి. 

నవ్వినా పట్టించుకోలేదు

‘‘గాడిదల్ని పెంచడం కోసం ఫామ్ పెడుతున్నానని తెలిసి చాలామంది నాతో ‘అదొక పిచ్చి పని’ అన్నారు. కొందరైతే మొహం మీదే నవ్వేశారు కూడా. అయినా నా ఆలోచన మార్చుకోలేదు. ఔషధ గుణాలు ఉండే గాడిద పాలని చాలామంది కొంటున్నారు. సూపర్​మార్కెట్, షాపులకు 30ఎం.ఎల్ పాల ప్యాకెట్​ని 150 రూపాయలకు అమ్ముతున్నా. బ్యూటీ ప్రొడక్ట్స్​ తయారీ కంపెనీలకు కూడా గాడిద పాలు అమ్మాలనుకుంటున్నా. ఇప్పటికే గాడిద పాల కోసం17 లక్షల రూపాయల ఆర్డర్లు వచ్చాయి” అని చెప్పాడు శ్రీనివాస్.  

వ్యవసాయం మీద ఇష్టంతో సాఫ్ట్​వేర్ జాబ్ వదులుకున్నాడు. పొలం పనులతో పాటు కోళ్లు, మేకలు, కుందేళ్లు పెంచడం మొదలుపెట్టాడు. ఈ మధ్యే డాంకీ ఫామ్ కూడా పెట్టాడు. ‘గాడిదల్ని పెంచడం ఏంటి?’ అని వెక్కిరించిన వాళ్ల మాటల్ని పట్టించుకోలేదు. ఔషధ గుణాలున్న గాడిద పాలు అమ్ముతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్న ఇతని పేరు శ్రీనివాస గౌడ.