సాఫ్ట్వేర్ కొలువు పోతే బుర్రలో గుజ్జున్న ఎవరైనా ఏం చేస్తారు..? పెట్టుబడికి డబ్బులుంటే బిజినెస్ ఆలోచనలు చేస్తారు. డబ్బులు లేకపోతే ఏదో ఒక ఉద్యోగమో.. ఇంకేదైనా కష్టానికి తగిన ఫలితం వచ్చే పని ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ.. గంజాయికి బానిసయి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయిన శశిధర్ అనే ఇతను మాత్రం ఏకంగా ఇంటి టెర్రాస్పై గంజాయి పెంచి సొమ్ము చేసుకుని.. ఆ గంజాయి మత్తులోనే మునిగి తేలాలనుకున్నాడు. ఎక్సైజ్ శాఖ చేసిన తనిఖీల్లో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయి మొక్కలతో పాటే అవే కుండీలో తులసి మొక్క కూడా పెంచుతుండటం కొసమెరుపు. గంజాయి వనంలో తులసి మొక్క అనే నానుడిని నిజం చేశాడు. మొత్తం 17 గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
ఎందుకిలా చేశావని అడిగితే.. అవి గంజాయి మొక్కలని తనకు తెలియదని.. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడే తెలిసిందని.. పీకేద్దామని అనుకున్నానని.. ఏవేవో కబుర్లు చెప్పాడు. నిందితుడు సీహెచ్ శశిధర్ను అరెస్ట్ చేశారు. ఘట్ కేసర్ ఎక్సై్జ్ స్టేషన్కు అతనిని అప్పగించారు. సొంత ఇల్లు కావడంతో సీహెచ్ శశిధర్కు గంజాయి మొక్కలు పెంచడం పెద్ద కష్టం కాలేదు. కానీ.. ఎవరు గమనించి సమాచారం ఇచ్చారో గానీ శశిధర్ గంజాయి మొక్కల వ్యాపారానికి గండి పడినట్టయింది.
►ALSO READ | రూ. 25 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన నారాయణపేట రెవెన్యూ ఆఫీసర్...
నాచారంలోని ఈస్ట్ గాంధీనగర్కు చెందిన శశిధర్ మత్తుకు బానిసగా మారి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి డబ్బులు లేక గంజాయి కొనడం కష్టంగా మారడంతో టెర్రాస్ పైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నాడో గానీ కొన్ని గంజాయి మొక్కలు పూతకు కూడా వచ్చాయి. మొత్తం ఈ గంజాయి మొక్కలను తూకం వేస్తే దాదాపు 10 కేజీల వరకూ ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

