కోల్‌కతా: బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని కొందరు కోడిగుడ్లు, రాళ్లతో కొట్టారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి శనివారం ఆయన దక్షిణ 24 పరగణాల జిల్లాలో సోనార్‌పూర్ ఏరియాకు వెళ్లారు. ఆ సమయంలో అభిషేక్ బెనర్జీపై స్థానికులు, బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లను విసిరారు.
అంతేకాకుండా ఆయనను ఉద్దేశించి ‘చోర్ చోర్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ దాడితో అక్కడ గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అభిషేక్ బెనర్జీ తలకు గాయం కాకుండా హెల్మెట్ పెట్టారు. చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి, అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ దాడిలో తన బట్టలు చిరిగిపోయాయని, కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని అభిషేక్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
