హైదరాబాద్, వెలుగు: ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. ఇందుకోసం మూడ్రోజుల కిందట ఆఫీసు స్పెషల్ బస్ సర్వీస్ సర్వేను చేపట్టింది. అయితే ఐటీ కంపెనీల రూట్లలో ఫుల్ ట్రాఫిక్ ఉంటోంది. మెట్రో రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. అయితే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం, సొంత వెహికల్స్ వాడకం పెరగడంతో ట్రాఫిక్ జామ్‌తో జర్నీకి ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా స్పెషల్ బస్ సర్వీస్‌లను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
స్పెషల్ బస్సులు ...
ఐటీ ఎంప్లాయీస్ చాలామంది మెట్రోలో వెళ్లేందుకు కూడా ఇంటి నుంచి వెహికల్స్ తెచ్చి, స్టేషన్ దగ్గర పార్క్ చేస్తున్నారు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే టైమ్‌లో కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక షటిల్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ షటిల్ సర్వీసుల అవసరం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఆర్టీసీ ఒక ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తోంది. ఇందులో ఎంప్లాయ్ పేరు, ఫోన్ నంబర్, కంపెనీ పేరు, పికప్, డ్రాపింగ్ ఏరియా, టైమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఆధారంగా తీసుకుని ఈ స్పెషల్ బస్సులను నడపనున్నారు.
యాప్‌లో టికెట్ బుకింగ్
ఈ షటిల్ బస్సు సర్వీసులను ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ఆర్టీసీ తీసుకురానుంది. ఈ యాప్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు బస్ ఎక్కడ ఉందనే వివరాలను ట్రాకింగ్ ద్వారా తెలుసుకునే వీలుంది. మహిళల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాకింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ యాప్‌లో బస్ సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు ఉంటాయి.
అవగాహన కల్పిస్తూ..
టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎంప్లాయీస్‌కు ఆయా కంపెనీలు అవగాహన కల్పిస్తున్నాయి. తెలంగాణా ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) ఈ ప్రపోజల్ పై ఆర్గనైజేషన్లకు సర్వే ఫామ్‌ను పంపిస్తున్నాయి. ఇందుకోసం పలు క్యాంపెయినింగ్ కూడా చేయనున్నట్లు టీఎఫ్‌ఎంసీ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఈ సేవలపై టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో సమావేశం కానున్నట్లు తెలిపారు.
ఎంతో ఉపయోగం..
ప్రస్తుతం 2 వేలకు ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి. ఎంతోమంది ఎంప్లాయీస్ హైబ్రిడ్ మోడ్‌లో పని చేస్తున్నారు. ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఐటీ ఎంప్లాయీస్‌కు ఎంతో ఉపయోగపడతాయి. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు సర్వేలో పాల్గొనేలా చూస్తున్నాం.
- సత్యనారాయణ, అధ్యక్షుడు, టీఎఫ్‌ఎంసీ
ట్రాఫిక్ సమస్య లేకుండా..
సర్వే ద్వారా బస్సు సర్వీసుల గురించి తెలుసుకున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ సర్వీస్‌లు ఎలా ఉంటాయి? బస్ నంబర్ ఇస్తారా? ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్‌కు స్పెషల్ బస్సుల ఏర్పాటు ఆలోచన బాగుంది. - ప్రసాద్, ఐటీ ఎంప్లాయ్, ఇన్ఫోసిస్

