రైల్వేలో మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు

రైల్వేలో మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు

రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేస్తోంది రైల్వేశాఖ. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇవాళ(మార్చి-8) మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొన్ని రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంతే కాకుండా భారత రైల్వేలో 14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో లక్ష మంది మహిళలు ఉన్నట్లు, వీరి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రిజర్వేషన్‌ కోటాను అమలు చేస్తున్నట్లు, అంతేకాకుండా 58 సంవత్సరాలు నిండిన మహిళలకు టిక్కెట్టు ధరలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. లాంగ్ జర్నీ రైళ్లలో ప్రత్యేకంగా లగేజ్‌ కమ్‌ గార్డ్‌ కోచ్‌ వెంబడి మహిళా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా బుకింగ్‌ కార్యాలయాల కౌంటర్లు, రిజర్వేషన్‌ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో మహిళా ప్రయాణికుల కోసం వెయిటింగ్‌ హాళ్లలో శానిటరీ న్యాప్‌కిన్‌ డిస్పెన్సర్‌ అండ్‌ ఇన్సినీరేటర్‌లను, అంతేకాకుండా చిన్నపిల్లలకు పాలిచ్చే విధంగా ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ.