V6 News

స్టార్‌‌ రైడర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌.. స్పెషల్‌‌ ఇంటర్వ్యూ

స్టార్‌‌ రైడర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌.. స్పెషల్‌‌ ఇంటర్వ్యూ
  • ఇంత స్టార్‌‌డమ్‌‌ ఊహించలేదు
  • రాహుల్‌‌ చౌదరితో పోటీ పడలేను
  • ఈ సారి తెలుగు టైటాన్స్‌‌దే టైటిల్‌‌
  • ‘వెలుగు’తో స్టార్‌‌ రైడర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌

సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌. పది నెలల కిందటి వరకూ అతనెవరో ఎవ్వరికీ తెలియదు. కానీ, ప్రొ కబడ్డీ లీగ్‌‌లో అతనిప్పుడు సెన్సేషన్‌‌. గత సీజన్‌‌లో యు ముంబా తరఫున అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. మూడు మ్యాచ్‌‌ల్లోనే యాభై రైడ్‌‌ పాయింట్లు రాబట్టి రికార్డు సృష్టించాడు. ఒక్క సీజన్‌‌తోనే రాహుల్‌‌ చౌదరి, పర్దీప్‌‌ నర్వాల్‌‌, అజయ్‌‌ ఠాకూర్‌‌ అంత స్టార్‌‌డమ్‌‌ తెచ్చుకున్నాడు. ఈ సీజన్‌‌ వేలంలో అత్యధిక రేటు (రూ. 1.45 కోట్లు) పలికి కబడ్డీ బాహుబలిలా మారిపోయిన ఈ మహారాష్ట్ర కుర్రాడు ఇప్పుడు తెలుగు టైటాన్స్‌‌ తరఫున మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. ఇండియన్‌‌ ఆర్మీ నుంచి ‘కబడ్డీ వార్‌‌’లోకి అడుగు పెట్టి.. లీగ్‌‌లో ఆడేందుకు ఐదేళ్లు వేచి చూసిన స్టార్‌‌ రైడర్‌‌ దేశాయ్‌‌తో ‘వెలుగు’స్పెషల్‌‌ ఇంటర్వ్యూ..

ఈ సీజన్‌‌లో ఫార్మాట్‌‌ కాస్త మారింది. దాని ప్రభావం లీగ్‌‌పై ఎలా ఉంటుంది?

వరుసగామ్యాచ్‌‌లు ఆడుతుంటే బాడీ రికవర్‌‌ కాదు. పెర్ఫామెన్స్‌‌ డౌన్‌‌ అవుతుంది. ఏ ప్లేయర్‌‌కైనా మ్యాచ్‌‌ తర్వాత రెస్ట్‌‌ అవసరం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఫార్మాట్‌‌ను మార్చారు. ఈ సారి ఒక జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌‌లే ఆడాలి. అలాగే, హోమ్‌‌లెగ్‌‌లో ఆతిథ్య జట్టు నాలుగు మ్యాచ్‌‌లే ఆడనుంది. ఈ లెక్కన ప్రతీ టీమ్‌‌ ఫెర్ఫామెన్స్‌‌ బాగుంటుందని అనుకుంటున్నా. లీగ్‌‌లో ముందంజ వేసేందుకు అన్ని జట్లకు సమాన అవకాశాలు ఉంటాయి.

ఆరో సీజన్‌‌ వరకూ లీగ్‌‌లో ఆడే చాన్స్‌‌ ఎందుకు రాలేదు?

లీగ్‌‌ మొదలైనప్పటి నుంచే ఇందులో ఆడాలని నేను కలలు కన్నా. ఫస్ట్‌‌ సీజన్‌‌ నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ, నా కల నిజం అయ్యేందుకు చాలా సమయం పట్టింది. దానికి నా వయసు కూడా ఒక కారణం. న్యూయంగ్‌‌ ప్లేయర్‌‌ కోటాలో ఈ టోర్నీకి సెలెక్ట్‌‌ కావాలంటే 22 ఏళ్లలోపు వయసుండాలి. లేదంటే నేషనల్స్‌‌లో ఆడి ఉండాలి. లీగ్‌‌ మొదలయ్యేటప్పటికే నా ఏజ్‌‌ 22. అందువల్ల నాకు సీనియర్‌‌ నేషనల్స్‌‌ ఆడడం తప్ప వేరే ఆప్షన్‌‌ లేదు. అక్కడ సత్తా చాటి ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు కొంత సమయం పట్టింది.

ఒక్క సీజన్‌‌లోనే స్టార్‌‌డమ్‌‌ వచ్చింది, వేలంలో భారీ రేటు పలికారు. ఈ స్థాయిని ఊహించారా?

నేను అస్సలు ఊహించలేదు. అంతా కలలా ఉంది. గత సీజన్‌‌లో యు ముంబా తరఫున లీగ్‌‌లో ఆడే చాన్స్‌‌ వచ్చినప్పుడు చాలా సంతోషించా. బాగా రాణించాలన్న ఆలోచనతో బరిలోకి దిగా. కానీ, అంతా బాగా ఆడుతానని అనుకోలేదు. మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు సీజన్‌‌ టాప్‌‌–3 రైడర్‌‌గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నా. అంతకుముందు నా ఆటను ఎవరూ చూడకపోవడం కూడా నాకు కలిసొచ్చింది.

ఈసారి మీ నుంచి, టైటాన్స్‌‌ నుంచి ఎలాంటి పెర్ఫామెన్స్‌‌ ఆశించొచ్చు?

గత సీజన్‌‌లో యు ముంబా తరఫున బాగా రాణించా. అదే టైమ్‌‌లో నాకు గాయం కూడా అయింది. అయినా నా సామర్థ్యంపై నమ్మకం ఉంచి టైటాన్స్‌‌ నాపై ఇంత భారీ మొత్తం ఖర్చు చేసింది. వాళ్ల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమ్ముచేయను. జట్టుకు ట్రోఫీ అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తా. మా టీమ్‌‌ కూడా అన్ని విభాగాల్లో సమతూకంలో కనిపిస్తోంది. టీమ్‌‌లో ఇద్దరు ఇరాన్‌‌ ప్లేయర్లు ఉన్నారు. డిఫెన్స్‌‌ను అబొజర్‌‌, విశాల్‌‌ లీడ్‌‌ చేస్తారు. రైడింగ్‌‌లో నాతో పాటు కొందరు కొత్త ప్లేయర్లు వచ్చారు. ఈ సారి కచ్చితంగా ట్రోఫీ నెగ్గగలమన్న నమ్మకం ఉంది.

టోర్నీకి ఎలా సన్నద్ధమయ్యారు?

రెండు నెలల నుంచి ప్రిపరేషన్స్‌‌ నడుస్తున్నాయి. కేరళలో 20 రోజుల ప్రాక్టీస్‌‌ క్యాంప్‌‌లో పాల్గొన్నాం. ఏడు రోజుల విరామం తర్వాత హైదరాబాద్‌‌కు వచ్చి ప్రాక్టీస్‌‌ చేశాం. లాస్ట్‌‌ క్యాంప్‌‌ కూడా ముగిసింది. నాతో పాటు టీమ్‌‌లో ఈ సారి చాలా మంది కొత్త ప్లేయర్లు వచ్చారు. అందరం త్వరగా కలిసిపోయాం. జూనియర్‌‌, సీనియర్‌‌ అన్న తేడా లేకుండా అంతా ఒక్కటిగా ఉంటున్నాం. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌‌ ఆడుదామని ఉత్సాహంగా ఉన్నాం.

రాహుల్‌‌ చౌదరి ప్లేస్‌‌లో స్టార్‌‌ రైడర్‌‌గా టైటాన్స్‌‌ టీమ్‌‌లోకి వచ్చారు. భారీ అంచనాలు ఉంటాయి. అందుకోగలరా?

రాహుల్‌‌ చాలా పెద్ద ప్లేయర్‌‌. నేను అతనితో పోటీ పడలేను. గత సీజన్‌‌లో నా పెర్ఫామెన్స్‌‌ చూశాక ఈ సారి అంచనాలు కచ్చితంగా పెరుగుతాయి. అయితే, వాటి గురించి ఆలోచించడం లేదు. నా వరకూ మరోసారి వంద శాతం సత్తా చాటేందకు ప్రయత్నిస్తా.

కబడ్డీని కెరీర్‌‌గా ఎంచుకోవాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, మీకు ఇన్‌‌స్పిరేషన్‌‌ ఎవరు?

ఈ ఆట అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. మా అన్నయ్య సూరజ్‌‌ దేశాయ్‌‌ నాకు ఇన్‌‌స్పిరేషన్‌‌. ఇప్పుడు మా టీమ్‌‌ (టైటాన్స్‌‌)లోనే ఉన్నాడు. మోను గోయత్‌‌ నా ఫేవరెట్‌‌ ప్లేయర్‌‌. మా ఇంట్లో వాళ్లు చదువుపై శ్రద్ధ పెట్టాలని చెప్పడంతో గ్రా డ్యుయేషన్‌‌ పూర్తి చేసి 2011లో ఆర్మీలో ఉద్యోగం సంపాదించా. అయినా ఎందుకో మనసు కబడ్డీ వైపు లాగింది. రెండేళ్ల తర్వాత జాబ్‌‌కు రిజైన్‌‌ చేశా. పుణెలో కొన్ని క్లబ్స్‌‌కు ఆడుతూ గేమ్‌‌ను మెరుగుపరుచుకున్నా. ప్రొ కబడ్డీ మొద లయ్యాక ఆటను మరింత సీరియస్‌‌గా తీసుకున్నా. గతేడాది జనవరిలో ఇదే స్టే డియంలో నేషనల్స్‌‌ ఆడా. టైటిల్‌‌ నెగ్గిన మహారాష్ట్ర టీమ్‌‌లో నేను మెంబర్‌‌ను. నా పెర్ఫామెన్స్‌‌ చూసి యు ముంబా ఆరో సీజన్‌‌లో అవకాశం ఇచ్చింది.

నా చిన్నప్పటి నుంచి మా విలేజ్‌‌లో కబడ్డీ చాలా ఫేమస్‌‌. గ్రౌండ్స్‌‌ లేకపోవడంతో పొలాల్లో ఖాళీ స్థలాల్లో ఆడుకునేవాళ్లం. కొంతకాలం తర్వాత ఆ ఆసక్తి తగ్గిపోయింది. కానీ, నేను లీగ్‌‌లోకి వచ్చి, హిట్‌‌ అవవడంతో ఇప్పుడంతా కబడ్డీలో లీనం అయిపోయారు. ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్​ ప్లేయర్‌‌ కావాలని ఆశిస్తున్నారు.

నాతో కలిసి ఆడిన ప్లేయర్లు ప్రొ కబడ్డీ లీగ్‌‌లో ఆడుతుంటే టీవీలో చూసేవాడిని. అప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా లీగ్‌‌లో ఆడాలి, మా ఇంట్లో వాళ్లు నన్ను టీవీలో చూడాలని అనుకున్నా. కాస్త ఆలస్యమైనా ఆ చాన్స్‌‌ వచ్చింది. ఒక్క సీజన్‌‌తోనే ఇంత పాపులారిటీ లభించడం మాత్రం నమ్మశక్యంగా లేదు.