T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రేపు ( మార్చి 8న) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న పిచ్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాజా నివేదికల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ మిక్స్‌డ్ సాయిల్ (ఎర్ర మట్టి + నల్ల మట్టి) పిచ్‌పై జరగనుంది. ఈ పిచ్‌లో ఎర్ర మట్టే ఎక్కువగా ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల బ్యాటర్లకు మంచి బౌన్స్ లభించి బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. ఇది ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ పిచ్‌ను పోలి ఉండే అవకాశం ఉందని టాక్. ఆ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ముఖ్యంగా సంజు శాంసన్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
200+ స్కోర్?:
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌పై కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పిచ్‌పై సగటు స్కోర్ సుమారు 200+ పరుగులుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మెగా టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 213 పరుగులు చేసి కెనడాపై గెలిచింది. అలాగే, ఈ మెగా టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ ఒక మ్యాచ్ మాత్రమే అహ్మదాబాద్‌లో ఆడింది. అయితే భారత్ రెండు మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.
ఎర్ర మట్టికి ప్రాధాన్యం?:
ఈ ప్రపంచకప్ ఫైనల్ కోసం ఎర్ర మట్టి ఎక్కువగా ఉండే పిచ్‌ను ఎంచుకోవడానికి ఒక కారణం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఎర్ర మట్టిపిచ్‌పై బౌన్స్ సమంగా ఉండటం వల్ల బ్యాటర్లు షాట్లు ఆడటానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే నల్ల మట్టిపిచ్‌లు కొన్నిసార్లు నెమ్మదిగా మారి బ్యాటింగ్‌కు కష్టంగా మారుతుంది. కాబట్టి, మిక్సిడ్ సాయిల్ పిచ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.
పిచ్‌లపై అసంతృప్తి:
ఈ టోర్నమెంట్‌లో లీగ్ దశలో ఇచ్చిన కొన్ని పిచ్‌లపై టీమిండియా మేనేజ్‌మెంట్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ స్థానిక క్యూరేటర్లతో మాట్లాడి పిచ్ తయారీపై తమ అభిప్రాయాలను తెలిపినట్లు రిపోర్టులు వెల్లడించాయి.
భారత్ వ్యూహం:
ఈ టోర్నమెంట్‌లో భారత్ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని జట్టు హై-రిస్క్, హై-రివార్డ్ స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో పాటు సంజు శాంసన్ స్థిరంగా బ్యాటింగ్ చేయడం జట్టుకు అదనపు బలం అవుతుంది. మొత్తానికి అహ్మదాబాద్‌లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటర్లు+ బౌలర్లు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని స్పోర్టింగ్ పిచ్ కనిపించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
