
అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నేనే నేనే.. నేనే హీరో అంటూ మజ్నుగా మనసుల్లోకి చొరబడ్డాడు. అల్లరి అల్లుడు అయ్యాడు. బంగారు బుల్లోడు అనిపించుకున్నాడు. మగువల మానసచోరుడిగా మెప్పుపొంది మన్మథుడిగా మెస్మరైజ్ చేశాడు. ‘నిన్నే ప్రేమిస్తా’ అనేవారు కొందరు. ‘నిన్నే పెళ్లాడతా’ అన్నారు మరికొందరు. అంతగా తన చూపులతో, గ్లామర్‌తో చంపేసిన కిల్లర్ తను. శివగా సైకిల్ చెయిన్ లాగి రౌడీల్ని పరుగెత్తించడం తెలుసు. అన్నమయ్యగా, రామదాసుగా భక్తి పారవశ్యంలో ముంచి వేయడమూ వచ్చు. వెరైటీకి కేరాఫ్. స్టైల్‌కి ఐకాన్. మొత్తంగా ఇండస్ట్రీలో ఆయనో సెన్సేషన్. ఎందరికో ఇన్‌స్పిరేషన్. అందరికీ వయసు పెరుగుతూ పోతుంది. ఆయనకి మాత్రం తరుగుతూ వస్తుంది. ఇప్పటికీ యంగ్ హీరోలకు ఆయనతో పోటీనే. బ్యూటిఫుల్ హీరోయిన్లకు ఆయన ఫేవరేట్ పెయిరే. ఉన్నట్టుండి ‘ఆటోడ్రైవర్’గా మారతాడు. అకస్మాత్తుగా ‘ఆజాద్’గా ప్రత్యక్షమై దేశద్రోహుల ఆట కట్టిస్తాడు. ‘శివమణి’గా సిన్సియారిటీ అంటే ఏంటో చూపిస్తాడు. ఏం చేసినా నువ్వు ‘సూపర్’ అనిపించుకోకుండా ఉండడు. కోట్లాదిమంది హృదయాలనేలే కింగ్. ఎన్నేళ్లు గడిచినా వెనకబడటమన్నదే తెలియని డాన్.
రాజన్నగా విప్లవ జ్వాలలు రగిలించాడు. గ్రీకువీరుడిగా గుండెల్లో దూరి గుసగుసలాడాడు. ఇమేజ్‌తో పని లేదు. స్టార్‌డమ్ అవసరమే లేదు. కథేంటి? నా పాత్రేంటి? ఇందులో కొత్తగా ఉన్నదేంటి? ఇంతే. అందుకే కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు. అడుగడుగునా కొత్త సోపానాలు. ఏం చేసినా బోలెడన్ని ప్రశంసలు. కాలేజీ కథలు, గ్యాంగ్ వార్‌లకు కొత్త ట్రెండును క్రియేట్ చేసింది ఆయనే. ఎమోషనల్ లవ్‌ని గీతాంజలితో కలిసి ప్రేక్షకులకి రుచి చూపించింది కూడా ఆయనే. ఆయన ఏం చేస్తే అదే స్టైల్. యంగ్‌స్టర్స్ అది ఫాలో అయ్యి తీరాల్సిన రూల్. వెండితెర మాత్రమేనా.. బుల్లితెర కూడా ఆయన సామ్రాజ్యమే. అక్కడ ఆయనే బాస్. బిగ్‌బాస్. చల్లగా సుద్దులు చెబుతాడు. సుతిమెత్తగా మొట్టికాయలూ వేస్తాడు. నవ్వులతో నలుగురినీ తనవైపు తిప్పేసుకోవడం.. కనుసైగతోనే కదలకుండా కట్టి పడేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. నటుడిగా.. నిర్మాతగా.. హోస్ట్ గా.. బిజినెస్‌మేన్‌గా.. ప్రతి పాత్రనూ సమర్థవంతంగా పోషించడం ఆయనకే చెల్లింది. అందుకే సౌత్‌తో పాటు, నార్త్ ప్రేక్షకగణమంతా ఆయనకు ఫిదా అయ్యింది. ఇండియన్ సినీ హిస్టరీలో ఆయనకి ప్రత్యేక స్థానం దక్కింది.
నంది పురస్కారం నుంచి నేషనల్ అవార్డ్ వరకు పలుమార్లు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఆయనే.. త్వరలో ‘ఘోస్ట్’గా రాబోతున్న ద మోస్ట్ హ్యాండ్‌సమ్ స్టార్.. నాగార్జున అక్కినేని. తన స్టైల్‌తో, చార్మ్ తో, పర్‌ఫార్మెన్స్ తో కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు నాగ్. మరిన్ని సంవత్సరాల పాటు ఇంతే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని కోరకుంటూ.. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.