221 టార్గెట్ పెట్టి కూడా ముంబై చేతిలో కోల్కత్తా ఎందుకు ఓడిపోయిందంటే..

221 టార్గెట్ పెట్టి కూడా ముంబై చేతిలో కోల్కత్తా ఎందుకు ఓడిపోయిందంటే..
  • 6 వికెట్ల తేడాతో కోల్‌‌కతాపై ముంబై గెలుపు
  • దంచికొట్టిన రోహిత్‌‌, రికెల్టన్‌‌
  • రహానె, రఘువంశీ శ్రమ వృథా
  • రాణించిన శార్దూల్‌‌ ఠాకూర్‌‌

బౌలర్లు ఫెయిలైనా.. బ్యాటర్లు దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌‌‌‌-19లో ముంబై ఇండియన్స్‌‌‌‌ బోణీ కొట్టింది. భారీ స్కోర్​ చేజింగ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ శర్మ (78), రికెల్టన్ (81) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌పై గెలిచింది. ముందుగా కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 220/4 స్కోర్​ చేసింది. కెప్టెన్‌‌‌‌ అజింక్య రహానె (67), రఘువంశీ (51) హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించారు. తర్వాత ముంబై 19.1 ఓవర్లలో 224/4 స్కోరు చేసి నెగ్గింది.

ముంబై: బ్యాటింగ్‌‌లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్‌‌.. ఐపీఎల్‌‌–19లో బోణీ చేసింది. ఛేజింగ్‌‌లో రోహిత్‌‌ శర్మ (38 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 78), రైన్‌‌ రికెల్టన్‌‌ (43 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 81) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 220/4 స్కోరు చేసింది. కెప్టెన్‌‌ అజింక్య రహానె (40 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 67), అంగ్‌‌క్రిష్‌‌ రఘువంశీ (29 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 51) హాఫ్‌‌ సెంచరీలు సాధించారు. తర్వాత ముంబై 19.1 ఓవర్లలో 224/4 స్కోరు చేసి నెగ్గింది. శార్దూల్‌‌​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

టాప్‌‌ లేపారు..
బ్యాటింగ్‌‌కు అనుకూలించిన పిచ్‌‌పై ముంబై బౌలర్‌‌ శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (3/39) కీలక వికెట్లు తీసినా.. ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (0/38), జస్ప్రీత్‌‌ బుమ్రా (0/35) ఫెయిలయ్యారు. దాంతో కోల్‌‌కతా టాప్‌‌ ఆర్డర్‌‌ పరుగుల సునామీ సృష్టించింది. బౌల్ట్ తొలి ఓవర్‌‌లోనే రహానె సిక్స్‌‌తో ఇన్నింగ్స్‌‌ను ఆరంభించగా, రెండో ఎండ్‌‌లో అలెన్‌‌ కూడా అదే దూకుడును కొనసాగించాడు. 

పాండ్యా (1/39) వేసిన నాలుగో ఓవర్‌‌ నుంచి కోల్‌‌కతా ఇన్నింగ్స్‌‌కు అసలు ఊపు వచ్చింది. లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌ తప్పిన ఆ ఓవర్‌‌లో పాండ్యా ఏకంగా 26 రన్స్‌‌ ఇచ్చుకున్నాడు. రహానె రెండు సిక్స్‌‌లు, అలెన్‌‌ మూడు ఫోర్లు బాదారు. తర్వాత గజన్‌‌ఫర్‌‌ (0/51) ఓవర్‌‌లో అలెన్‌‌ను రెండు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌తో 17 రన్స్‌‌ దంచాడు. ఆరో ఓవర్‌‌లో శార్దూల్‌‌ రెండో బాల్‌‌కే అలెన్‌‌ ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 69 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది.

పవర్‌‌ప్లే ముగిసేసరికి కేకేఆర్‌‌ 78/1తో మంచి స్థితిలో నిలిచింది. వన్‌‌డౌన్‌‌లో కామెరూన్‌‌ గ్రీన్‌‌ (18) కూడా బ్యాట్‌‌ ఝుళిపించడంతో ఎనిమిదో ఓవర్‌‌లోనే కోల్‌‌కతా స్కోరు వందకు చేరింది. ఈ క్రమంలో రహానె 27 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 9వ ఓవర్‌‌లో శార్దూల్‌‌ వేసిన షార్ట్‌‌ డెలివరీకి గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌‌ను రూథర్‌‌ఫోర్డ్‌‌ అద్భుతంగా అందుకున్నాడు. ఫలితంగా రెండో వికెట్‌‌కు 40 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 

ఈ దశలో వచ్చిన రఘువంశీ వేగంగా ఆడాడు. అయితే 21 రన్స్‌‌ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌‌ను రోహిత్‌‌ వదిలేశాడు. 14వ ఓవర్‌‌లో శార్దూల్ వేసిన స్లో బాల్‌‌కు రహానె వెనుదిరిగాడు. మూడో వికెట్‌‌కు 36 రన్స్‌‌ జతయ్యాయి. 28 బాల్స్‌‌లో ఫిఫ్టీ చేసిన రఘువంశీకి చివర్లో రింకూ సింగ్‌‌ (33 నాటౌట్‌‌) తోడయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు 60 రన్స్‌‌ జోడించారు. అయితే బుమ్రా 18, 20వ ఓవర్లలో రన్స్‌‌ కట్టడి చేయడంతో నైట్‌‌రైడర్స్‌‌ స్కోరు 250కి చేరలేదు. 

ఓపెనర్లు అదుర్స్‌‌..
భారీ ఛేజింగ్‌‌లో ముంబైకి ఓపెనర్లు రోహిత్‌‌, రికెల్టన్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్‌‌ రెండు ఫోర్లు, రోహిత్‌‌ ఒక బౌండ్రీతో ఖాతా తెరిచారు. మూడో ఓవర్‌‌లో రోహిత్‌‌ 6, రికెల్టన్‌‌ రెండు సిక్స్‌‌లతో 19 రన్స్‌‌ దంచారు. తర్వాతి ఓవర్‌‌లోనూ చెరో సిక్స్‌‌ బాదారు. 5, 6 ఓవర్లలో రోహిత్‌‌ 4, 6, 4, 6, 6తో 23 బాల్స్‌‌లోనే  ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఐపీఎల్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌కు ఇది 50వ హాఫ్‌‌ సెంచరీ కావడం విశేషం. ఈ ఇద్దరి జోరుతో పవర్‌‌ప్లేలో ముంబై 80/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 

ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత సునీల్‌‌ నరైన్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి రన్స్‌‌ కట్టడి చేశారు. రెండు ఓవర్లలో 16 రన్స్‌‌ మాత్రమే ఇచ్చారు. అయితే 9వ ఓవర్‌‌లో రికెల్టన్‌‌ రెండు సిక్స్‌‌లతో నరైన్‌‌ను దెబ్బకొట్టాడు. 10వ ఓవర్‌‌లో రోహిత్‌‌ ఫోర్‌‌తో స్కోరు 122/0కు పెరిగింది. 11వ ఓవర్‌‌లో రికెల్టన్‌‌ 6, 4 దంచగా, 12వ ఓవర్‌‌లో ముంబైకి తొలి దెబ్బ తగిలింది. వైభవ్‌‌ అరోరా (1/52) బౌలింగ్‌‌లో 4, 6 కొట్టిన రోహిత్‌‌ ఐదో బాల్‌‌కు ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌‌కు 148 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది.

ఫోర్‌‌తో ఆట మొదలుపెట్టిన సూర్యకుమార్‌‌ (16) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయగా, రికెల్టన్‌‌ ఎదురుదాడిని కంటిన్యూ చేశాడు. కానీ 15వ ఓవర్‌‌లో ఫోర్‌‌ కొట్టిన సూర్య రెండో బాల్‌‌కు భారీ షాట్‌‌కు యత్నించి లాంగాన్‌‌లో రింకూ సింగ్‌‌కు చిక్కాడు. దాంతో రెండో వికెట్‌‌కు 31 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్‌‌లో రికెల్టన్‌‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. ఆరు బాల్స్‌‌ తేడాలో రెండు వికెట్లు పడటంతో ముంబై కాస్త ఇబ్బందుల్లో పడింది. తిలక్‌‌ వర్మ (20) సింగిల్స్‌‌ తీయగా, హార్దిక్‌‌ పాండ్యా (18 నాటౌట్‌‌) రెండు వరుస ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. 17వ ఓవర్‌‌ నుంచి బౌండ్రీలు బాదిన తిలక్‌‌ నాలుగో వికెట్‌‌కు 31 రన్స్‌‌ జోడించి వెనుదిరిగాడు. చివర్లో పాండ్యా, నమన్‌‌ధీర్‌‌ (5 నాటౌట్‌‌) విజయాన్ని అందించారు. నరైన్‌‌, కార్తీక్‌‌ త్యాగీ చెరో వికెట్‌‌ తీశారు.

సంక్షిప్త స్కోర్లు
కోల్‌‌కతా: 20 ఓవర్లలో 220/4 (రహానె 67, రఘువంశీ 51, శార్దూల్‌‌ 3/39). ముంబై: 19.1 ఓవర్లలో 224/4 (రికెల్టన్‌‌ 81, రోహిత్‌‌ 78, నరైన్‌‌ 1/30).