చరిత్రలో తొలిసారి: డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..

 చరిత్రలో తొలిసారి: డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా క్షీణించి 95 రూపాయల మార్కును దాటింది. ఆర్‌బిఐ (RBI) ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రూపాయి పతనం ఆగడం లేదు. ఈరోజు సోమవారం(30 మార్చ్ 2026) డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.3% తగ్గి 95.20కి చేరుకుంది. విదేశీ పెట్టుబడిదారులు  డబ్బులు  వెనక్కి తీసుకోవడం, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రూపాయిపై ఒత్తిడి పెరిగింది.

ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు 
రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండటానికి రిజర్వ్ బ్యాంక్ కొన్ని కఠిన నిబంధనలు పెట్టింది.  బ్యాంకులు విదేశీ మారక మార్కెట్‌లో ఉంచుకునే నికర నగదుపై పరిమితులు విధించింది. బ్యాంకులు వాటి దగ్గర ఉన్న డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయికి మద్దతు ఇవ్వాలని సూచించింది. కరెన్సీ మార్కెట్‌లో రేట్లు పెంచి లాభపడాలనుకునే 'ఆర్బిట్రేజ్' ట్రేడ్‌లను అరికట్టాలని చూస్తోంది.

రూపాయి ఎందుకు పడిపోతోంది 
అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడుల కారణాల వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. భారత్ ఎక్కువగా విదేశాల నుండి చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, మన దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లిపోతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుండి వారి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ప్రపంచ యుద్ధ భయాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ALSO READ : ఇరాన్ ఆయిల్‌పై కన్నేసిన ట్రంప్..

మార్కెట్లపై ప్రభావం
కేవలం రూపాయి మాత్రమే కాదు, ఈరోజు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. నిఫ్టీ సుమారు 2% పడిపోయింది. 2020 మార్చి  తర్వాత స్టాక్ మార్కెట్‌కు ఇది అత్యంత దారుణమైన నెలగా నిలిచింది.

గత ఏడేళ్లలో రూపాయికి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ ఒక్క మార్చి నెలలోనే రూపాయి విలువ 4% పైగా క్షీణించింది. చమురు ధరలు తగ్గకపోయినా లేదా విదేశీ పెట్టుబడులు తిరిగి రాకపోయినా రూపాయిపై ఈ ఒత్తిడి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.