మెున్నటికి మెున్న వెనిజులాలో ప్రభుత్వాన్ని కూల్చి క్రూడ్ ఆయిల్ చేజిక్కించుకున్న ట్రంప్ ఇరాన్ విషయంలోనూ అదే ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు నెల గడుస్తున్న వేళ తన మనసులోని అసలైన ప్లాన్ అదే క్రూడ్ ఆయిల్ కొల్లగొట్టడం గురించి తొలిసారిగా కీలక కామెంట్స్ చేశారు.
తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. తనకు ఇరాన్‌లోని చమురును తీసుకోవడమే ఇష్టం అంటూ బాహాటంగా ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ క్రూడ్ ఎగుమతులకు గుండెకాయ లాంటి ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ పెద్దగా రక్షణ వ్యవస్థలు యాక్టివ్ గా లేవని తాము దానిని ఈజీగానే సొంతం చేసుకోగలమంటూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
కేవలం మాటలతోనే సరిపెట్టకుండా.. ఇప్పటికే మధ్యప్రాచ్యానికి వేలాది మంది అమెరికన్ సైనికులను ట్రంప్ పంపించారు. సుమారు 10వేల మంది గ్రౌండ్ ఆపరేషన్స్ నిపుణులు, మెరైన్స్, 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ బలగాలు రంగంలోకి దింపింది అమెరికా. ఇరాన్ తీర ప్రాంతాలపై దాడి చేసి, క్రూడ్ ఆయిల్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకోవడమే ఈ సైనిక కదలికల ముఖ్య ఉద్దేశ్యమని తెలుస్తోంది.
ఈ అమెరికా కుట్రలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ స్పందిస్తూ.. అమెరికా బయటకు చర్చల గురించి చెప్తూనే, లోపల భూతల దాడులకు ప్లాన్ చేస్తోందన్నారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికైనా తమ సైన్యం సిద్ధంగా ఉందని.. అమెరికా సైనికులు అడుగుపెడితే వారిని మంటల్లో తగలబెడతాం అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఒకవైపు యుద్ధం గురించి మాట్లాడుతూనే.. మరోవైపు చర్చలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయని ట్రంప్ చెప్పడం గమనార్హం. పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలు నడుస్తున్నాయని, ఏప్రిల్ 6 లోపు ఇరాన్ ఒక ఒప్పందానికి రాకపోతే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ డెడ్‌లైన్ పెట్టారు. ట్రంప్ చేస్తున్న పనులతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే బారెల్‌కు 116 డాలర్లకు చేరుకుని చాలా దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది.
