చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిపై డిప్యూటీ సీఎం ఉదయనిధి తీవ్ర విమర్శలు చేశారు. పళనిస్వామి ప్రధాని మోడీ బానిస అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా పళనిస్వామి సైద్ధాంతిక గురువులు అని హాట్ కామెంట్ చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం (మార్చి 30) నుంచి ఉదయనిధి స్టాలిన్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా డీఎంకె వ్యవస్థాపకుడు సిఎన్. అన్నదురై స్వస్థలమైన కాంచీపురంలో క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను తమిళనాడు, ఢిల్లీ మధ్య పోరుగా అభివర్ణించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించి ప్రధాని మోడీ, అమిత్ షాలను తమిళనాడులో అడుగు పెట్టనియ్యోద్దని అన్నారు. తమిళనాడు ఎప్పుడూ ఢిల్లీ చెప్పుచేతల్లో లేదు.. ఇకపై ఉండదని నిరూపించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీని తమిళనాడు పూర్తిగా పక్కన పెట్టాలని సూచించారు. తమిళనాడు అభివృద్ధి కోసం మరోసారి డీఎంకేను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 2026, ఏప్రిల్ 23 ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 234 స్థానాలకు విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ విజయ్‌తో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఇందుకు విజయ్ ఒప్పుకోలేదు. ఒంటరిగా పోటీ చేసేందుకే మొగ్గు చూపాడు. దీంతో ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి, టీవీకే మధ్య ట్రయాంగిల్ ఫైట్ సాగనుంది.
