హైదరాబాద్ లో కోటి రూపాయల హాష్ ఆయిల్ స్వాధీనం

 హైదరాబాద్ లో  కోటి రూపాయల హాష్ ఆయిల్ స్వాధీనం

 హైదరాబాద్ సిటీలో  కోటి రూపాయల విలువైన హాష్ ఆయిల్ ను అక్రమంగా తరలిస్తుండగా ఎస్వోటీ, మహేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. మహేశ్వరం   డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హాష్ ఆయిల్ (గంజాయి ద్వారా తయారు చేసే నూనె)ను మహేశ్వరం పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందం  నిర్వహించిన తనిఖీలలో పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటిగా అంచనా వేశారు. 

నిందితుడు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన చంటి బాబు, ఒరిస్సాకు చెందిన రాజారావు వద్ద నుండి ఈ డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని ఒక గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేయడానికి ప్రయత్నించాడు. మార్చి 29న  సాయంత్రం మహేశ్వరం గేట్ బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న సమయంలో పోలీసులు అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హాష్ ఆయిల్,2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుడు చంటి బాబుపై గతంలో ఏపీలోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో 4 NDPS కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ తెలిపారు.

యువత,విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్‌తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులను అభినంధించారు.