శ్రీరామనవమి వచ్చిందంటే చాలు.. దేశంలోని ప్రతి వీధిలో కూడా కళ్యాణాన్ని జరిపిస్తారుభక్తులు.. అలా పానకం.. వడపప్పును ప్రసాదంగా పంచి పెడతారు.. ఇంకా చాలా చోట్లచలువ పందిళ్లు వేస్తారు. శ్రీరామనవమి రోజు పానకం.. వడపప్పు ప్రసాదానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.. చలువ పందిళ్లను ఎందుకు ఏర్పాటు చేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
శ్రీరామ నవమి రోజు పెందలాడే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి పూజ గదిని శుభ్రం చేశాక శ్రీరామ పట్టాభిషేకం పటాన్ని పూజ గదిలో ఉంచి పూజించాలి. శ్రీరామ అష్టోత్తరాన్ని జపించాలి. ఈ రోజు దీపారాధన కొబ్బరి నూనెతో చేస్తే మంచిదని అంటారు.
రాముడికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేధ్యంగా పెట్టాలి. పూజ అయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి.. సాయంత్రం రామాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలి. అలాగే పందిళ్లలో లాగా గుడిలో జరిగి సీతారాముల కళ్యాణాన్ని చూసి, మనసారా రామనామం స్మరించుకోవాలి.
శ్రీరామనవమి రోజు కొందరు ఉపవాసం ఉంటారు.ఉపవాస దీక్షను ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు లేదా దేవాలయంలో సీతారాముల కల్యాణం చూసి. ఇంటికి వచ్చే వరకు. వాళ్లవాళ్ల ఓపిక ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని కొనసాగించాలి.
వడపప్పు- పానకం
శ్రీరామ నవమి రోజు వడపప్పు, పానకం తయారుచేసి శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా దేవుళ్ల కోసం తయారు చేసే ప్రసాదాలన్నీ ఆయా కాలాలు, మనుషుల ఆరోగ్యాలకు సంబంధించినవై ఉంటాయి. అలాగే ఈ పండుగ రోజు తయారు చేసే వడపప్పు పానకం వెనక కూడా ఇలాంటి రహస్యమే ఉంది. ఈ కాలంలో ఎక్కువ గొంతు నొప్పులు వస్తాయి. బెల్లం పొడి చేసి నీళ్లు కలిపి పానకం తయారు చేస్తారు. ఆ నీళ్లలో మిరియాలు, యాలకులపొడి కలుపుతారు.
వడపప్పు – పానకం గొంతు సమస్యలను తగ్గిస్తాయి. అలాగే పెసరపప్పు వానబెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వడపప్పు దాన్ని తగ్గించి, జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీరం నుంచి చెమట రూపంలో నీళ్లు ఎక్కువగా బయటకు పోతుంటాయి. అందుకే పానకం, వడపప్పు శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, చల్లదనాన్ని కూడా ఇస్తాయి. ఆలోచిస్తే వడపప్పులోనే 'వడ' అనే పదం ఉంది. అంటే వడ దెబ్బ నుంచి కాపాడుతుందని అర్ధం చేసుకోవచ్చు.
చలువ పందిళ్లు
శ్రీరామనవమికి గ్రామాల్లో ప్రత్యేకంగా చలువ పందిళ్ళు వేస్తారు. ఈ పందిళ్ల కోసం తాటాకులు, కొబ్బరి మట్టలు, వెదురు గుంజలను మాత్రమే వాడతారు. ఆ పందిళ్లలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహిస్తారు. తెలుగునేలపై కొన్ని ప్రాంతాల్లో కేవలం సీతారాముల వివాహాన్ని మూడు రోజులు ఐదు రోజులు, తొమ్మిది రోజులు వాళ్ల వాళ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పందిళ్లలో ఘనంగా చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భజనలు చేస్తారు. భక్తి గీతాలు పాడుతారు.
వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. తాటాకులు, కొబ్బరి మట్టలు ఆ వేడిని గ్రహిస్తాయి. ఇలా పందిళ్లు వేసి, స్వామివారి పెళ్లి జరిపించడం అన్నది కేవలం ఒక్క ఈ పండుగలోనే కనిపిస్తుంది. పందిళ్లు వేయడం, పెళ్లి చేయడం తెలుగు వారి సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగానే సీతారాముల వివాహాన్ని సొంత పండుగలా భక్తులుచేస్తారు.
