ఎస్బీఐ అంచనాలు అందుకోలే

ఎస్బీఐ అంచనాలు అందుకోలే
  • రూ. 6,068 కోట్లకు తగ్గుదల

న్యూఢిల్లీ: దాదాపు అన్ని ప్రభుత్వ  బ్యాంకులు 2021 జూన్​ క్వార్టర్​తో పోలిస్తే ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో ఎక్కువ లాభాలను ప్రకటించాయి. ప్రైవేటు బ్యాంకులూ ఆశించిన గ్రోత్​ను సాధించాయి. మనదేశంలోనే అతిపెద్దది అయిన స్టేట్​బ్యాంక్​ మాత్రం నిరాశపర్చింది. ఈసారి దీని లాభం 6.7 శాతం తగ్గి రూ. 6,068 కోట్లకు పడిపోయింది. ట్రెజరీ నష్టాలు, లాభదాయకత తగ్గడం వల్ల ఆదాయం పడిపోయింది. ఎస్​ఐబీకి ఈసారి రూ. 7,496 కోట్ల లాభం వస్తుందని, ఏడాది లెక్కన ఇది 16 శాతం పెరుగుతుందన్న ఎనలిస్టుల అంచనాలు నిజం కాలేదు. 

లాభం పెరగడానికి బదులు తగ్గింది. స్టేట్​బ్యాంక్​కు భారీ ఫిక్స్​డ్​ ఇన్​కమ్​ సెక్యూరిటీల పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఉంది. వీటిలో ప్రభుత్వ సెక్యూరిటీల వాటా భారీగా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ కాలంలో బాండ్ ఈల్డ్‌‌‌‌లు భారీగా పెరగడం వల్ల బ్యాంకు  ట్రేడింగ్ బుక్‌‌‌‌లో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. బాండ్ ఈల్డ్స్ పెరిగినప్పుడు, వాటి ధరలు తగ్గి నష్టాలు వస్తాయి. వీటిని మార్క్- టు -మార్కెట్ లాభాలు లేదా నష్టాలు అని కూడా పిలుస్తారు. ఈసారి రూ.6,549 కోట్ల మార్క్- టు -మార్కెట్ నష్టాల కారణంగా ఎస్‌‌‌‌బీఐ వడ్డీయేతర ఆదాయం రూ.11,802 కోట్ల నుంచి రూ.2,312 కోట్లకు భారీగా తగ్గించింది. 

దీంతో ఈ క్వార్టర్​లో నిర్వహణ లాభం 32.8 శాతం తగ్గి రూ.12,753 కోట్లకు పడింది. బాండ్ల నష్టాలను తగ్గించడానికి బ్యాంక్ చర్యలు చేపట్టిందని చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు.  ప్రస్తుతం తమ పరిస్థితి బాగానే ఉందని అన్నారు. నికర వడ్డీ ఆదాయం.. అంటే బ్యాంకు తన లోన్​ కార్యకలాపాల ద్వారా సంపాదించే వడ్డీ ఆదాయానికి  డిపాజిటర్లకు చెల్లించే వడ్డీకి మధ్య తేడా. ఇది జూన్ క్వార్టర్​లో 12.87 శాతం పెరిగి రూ. 31,196 కోట్లకు చేరుకుంది.  మార్జిన్లు బాగుండటం, లోన్లు పెరగడం ఇందుకు కారణాలు. 

బ్యాలెన్స్ షీట్ గ్రోత్​

స్టేట్​ బ్యాంక్​ లోన్​ బుక్​ విలువ ఈసారి 14.9 శాతం పెరిగింది. కార్పొరేట్, రిటైల్ లోన్​ బుక్స్​  పెరిగాయి. ఈ క్వార్టర్​లో లోన్​ గ్రోత్​ 14-–15 శాతంగా ఉంటుందన్న ఎనలిస్టుల అంచనాలను స్టేట్​ బ్యాంక్​ అందుకుంది. కార్పొరేట్ లోన్లు సంవత్సరానికి 10.57 శాతం పెరగగా, రిటైల్ బుక్ 18.58 శాతం ఎగిశాయి.  నికర వడ్డీ మార్జిన్ (ఎన్​ఐఎం) 8 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 3.23 శాతానికి చేరింది. ఈ క్వార్టర్​లో అప్పులపై ఎక్కువ వడ్డీని సంపాదించడం వల్ల ‘ఫండ్స్​ఆఫ్​ కాస్ట్’​ తగ్గింది. 

కరెంట్  సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 6.5 శాతం పెరిగాయి. మొత్తం డిపాజిట్ బుక్‌‌‌‌లో వీటి వాటా 45.33 శాతంగా ఉంది. ఈ క్వార్టర్​లో మొత్తం డిపాజిట్లు 8.73 శాతం పెరిగాయి. అసెట్​ క్వాలిటీ మెరుగుపడింది. మొండి బకాయిల కేటాయింపులు తగ్గాయి.  ప్రొవిజన్లు 15 శాతం తగ్గి రూ.4268 కోట్లకు  పడిపోయాయి.​ గ్రాస్​ ఎన్​పీఏలు ఏడాది లెక్కన 15 శాతం తగ్గి రూ.1.13 లక్షల కోట్లకు పడిపోయాయి.  నికర ప్రాతిపదికన, మొత్తం లోన్​ బుక్​లో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్​ ఒక శాతం మాత్రమే ఉన్నాయి. 

యెస్​ బ్యాంకు వాటాను 26 శాతానికి తగ్గించుకుంటం: స్టేట్​ బ్యాంక్​ చైర్మన్​ దినేశ్​ ఖారా
యెస్​ బ్యాంకులో తమ వాటాను ఈ ఆర్థిక సంవత్సరంలోనే 26 శాతానికి తగ్గించుకుంటామని దినేశ్​ ఖారా ప్రకటించారు. ప్రస్తుతం 30 శాతం వాటా ఉందని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వాటాను కూడా కొనసాగించాలా ? అమ్మాలా ? అనే విషయమై తమ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఎస్​బీఐకి యెస్ బ్యాంక్‌‌లో 30 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్‌‌లో 3 శాతం వాటాలు ఉన్నాయి. 
యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌‌సి ఫస్ట్ బ్యాంక్,  బంధన్ బ్యాంకులకు కూడా యెస్​బ్యాంకులో 1 నుండి 2 శాతం వరకు వాటాలు ఉన్నాయి. ఈ బ్యాంకుల కన్సార్టియంకు నాయకత్వం వహిస్తున్న ఎస్‌‌బిఐ యెస్​బ్యాంక్​ 2020లో దివాలా అంచున ఉన్నప్పుడు ఆదుకుంది.  రూ.10,000 కోట్లను ఎమర్జెన్సీ క్యాపిటల్​గా ఇచ్చింది. ఈ పెట్టుబడులపై లాభాలు వచ్చాక కూడా యెస్​ బ్యాంక్​లో తన వాటాను కొనసాగించుకునేందుకు అవకాశం ఉంది.