ఇవాళ్టి(జూన్ 5) నుంచి సర్కారు దవాఖానల్లో ఓపీ బంద్

ఇవాళ్టి(జూన్ 5) నుంచి సర్కారు దవాఖానల్లో ఓపీ బంద్
  • సమ్మె సైరన్ మోగించిన గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్
  •  జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్.. స్పౌజ్​, ప్రయారిటీ కేటగిరీలను గాలికొదిలేశారని మండిపాటు
  • అధికారుల తీరుకు నిరసనగా ఓపీ, ఆపరేషన్ల బహిష్కరణ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) మండిపడింది. గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘం నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జీవో నం. 38 ప్రకారం బదిలీలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల వందలాది మంది వైద్యులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

నిబంధనలను తుంగలో తొక్కారు..

ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం బదిలీలు జరగకపోవడంపై డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పౌజ్​(భార్యాభర్తలు) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి, అనారోగ్య సమస్యలు ఉండి ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తూ, వ్యక్తిగత కారణాలతో రిక్వెస్ట్ బదిలీలు కోరుతున్న వైద్యుల విజ్ఞప్తులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని మండిపడ్డారు. గుర్తింపు పొందిన సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని అమలు చేయకపోవడం అధికారుల మొండివైఖరికి నిదర్శనమని వారు ధ్వజమెత్తారు.

సమ్మె బాటలో పెద్దాసుపత్రులు..

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌తో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు సంఘం స్పష్టం చేసింది. అత్యవసర సర్జరీలు మినహా, ముందుగా నిర్ణయించిన ఎలక్టివ్ ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జీవో 38లోని ప్రతి అంశాన్ని అక్షరాలా అమలు చేసే వరకు తాము బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైద్యుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకుని బదిలీల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడాలని, వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించిపోతాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, డాక్టర్ రౌఫ్, డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ మురళీధర్, డాక్టర్ భూపేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.