వరి సాగుపై గడికో మాట

వరి సాగుపై గడికో మాట
  • మొన్నటిదాకా చివరి గింజ వరకు కొంటమని ప్రకటనలు.. ఇప్పుడు వరి వద్దంటున్న సీఎం 
  • బాయిల్డ్​ రైస్​ను కేంద్రం కొనడం లేదంటూ తప్పుకునే ప్లాన్​
  • ఈ వానాకాలంలో 60 లక్షల టన్నులు కొంటమన్న కేంద్రం
  • వడ్లు కొనే బాధ్యత రాష్ట్ర సర్కారుకు లేదా?: రైతు నేతలు

ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులతో ఆడుకుంటున్నది. వచ్చే యాసంగి నుంచి వరి వేయొద్దంటూ ఇప్పుడు ఏకంగా రైతుల మెడపై కత్తి పెట్టినంత పనిచేసింది. ధాన్యం ఉత్పత్తి, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, దేశంలోనే రికార్డు నెలకొల్పిందని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూనే.. మరోవైపు వరి సాగు చేయొద్దంటూ ఆంక్షలు పెడుతోంది. ముందనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ వానాకాలంలో 60 లక్షల టన్నుల వడ్లను కొంటామని కేంద్రం ప్రకటించగా.. మిగతా వడ్లను సేకరించే బాధ్యత నుంచి రాష్ట్ర సర్కారు తప్పుకుంటున్నది. 
కొనబోం అంటే ఎట్ల?
షరతుల సాగులో భాగంగా కొంత విస్తీర్ణానికే వరిని పరిమితం చేయాలని ఒకసారి, సన్నాలే వేయాలని ఇంకోసారి, భారతదేశం ఆశ్చర్యపడే, అడ్డంపడే శుభవార్త రైతులకు చెప్తామని మళ్లోసారి, ఊర్లలో కొనుగోలు కేంద్రాలు పెట్టబోమని ఒకసారి.. ఇట్ల ఏడాది నుంచి రాష్ట్ర సర్కారు రకరకాలుగా చెప్తూ వచ్చింది. దేశం ఆశ్చర్యపడే, అడ్డంపడే శుభవార్త ఇప్పటికీ చెప్పలేదు కానీ.. వరి సాగు చేస్తే ఉరి వేసుకున్నట్లేనని ఆదివారం జరిగిన రివ్యూలో  సీఎం కేసీఆర్​ హెచ్చరించిన తీరు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కిలో బాయిల్డ్​ రైస్​ కూడా కొనబోమని కేంద్రం చెప్తోందని, అందుకే రాష్ట్రంలో ధాన్యం కొనే పరిస్థితి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పు మొత్తం కేంద్రంపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. వడ్లు పండించే రైతులకు భరోసా ఇవ్వకుండా ఇలా అల్టిమేటం జారీ చేయడం ఏమిటని రైతు నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా అని నిలదీస్తున్నారు. 

షరతుల సాగు పేరుతో నిరుటి నుంచే సీఎం కేసీఆర్​ వరి సాగును నియంత్రించే ప్రయత్నం మొదలు పెట్టారు. దొడ్డు బియ్యం కొనే ప్రసక్తి లేదని, సన్న రకాలు మాత్రమే సాగు చేయాలని ఆంక్షలు జారీ చేశారు. దీంతో రైతులు సన్నాలు సాగు చేశారు. తీరా.. సన్న రకం వడ్లు చేతికొచ్చాక ప్రభుత్వం మాట మార్చింది. అసలు వడ్లు కొనేది లేదంటూ మొండికేసింది. దీంతో అటు దిగుబడి తగ్గటంతో పాటు ఇటు గిట్టుబాటు ధర రాకపోవటంతో సన్న రకాలు వేసిన రైతులు రోడ్డున పడ్డారు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటామంటూ కొనుగోలు ప్రారంభించింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  సన్నాలన్నీ తక్కువ ధరకు అమ్ముకొని రైతులు భారీగా నష్టపోయారు. సన్నాలకు బోనస్​ ఇస్తామని చెప్పిన సర్కారు ఆ తర్వాత ఆ ముచ్చట్నే ఎత్తలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్​ రైస్​ కొనుగోలు చేయటం లేదనే సాకుతో వరి రైతులను నట్టేటా ముంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్న విమర్శలు వస్తున్నాయి.  
  
ఇక్కడ పండిన దాంట్లో 70%  ఇక్కడే వినియోగం
తాతల, ముత్తాతల కాలం నుంచే రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా సాగవుతోంది. తెలంగాణలోని నేలలు వరికి అనుకూలం కావడంతో దాదాపు 50 లక్షల మంది రైతులు ప్రతి సీజన్​లో వరిసాగు చేస్తున్నారు. గ్రౌండ్​ వాటర్​ పెరగడంతో బోర్ల కింద, ప్రాజెక్టులు, కాల్వలతో మరికొంత విస్తీర్ణంలో పంటను సాగు చేస్తున్నారు.  రాష్ట్రంలో జరిగే మొత్తం వరి ఉత్పత్తిలో దాదాపు 70 % రాష్ట్రంలోనే వినియోగమవుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.  ఎంతో కొంత వరి వేసుకుంటే ఇంట్లో తిండికి, మరికొంత అమ్ముకుంటే ఖర్చులకు మిగులుతాయని రైతులు ఆ పంటను క్రమం తప్పకుండా వేసుకుంటూ వస్తున్నారు. వానాకాలం సీజన్​లో పత్తి, కందులు, జొన్నలు, మొక్కజొన్నలు వంటి ఏ పంట, ఎంత విస్తీర్ణంలో వేసుకున్నా, రైతులు తనకున్న విస్తీర్ణంలో కనీసం ఎకరం వరకైనా వరి నాట్లు వేస్తారు. ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాలు వరి సాగైతే ఎకరాకు  23.5 క్వింటాళ్ల చొప్పున మొత్తం కోటి 30 లక్షల  టన్నుల దాకా ఉత్పత్తి వస్తుందని ఇటీవల కేంద్రానికి ఆఫీసర్లు నివేదించారు. దీంతో ఎఫ్​సీఐ గత ఏడాది ప్రకారం 48.75 లక్షల టన్నుల సెంట్రల్​ పూల్​లో కొనుగోళ్లకు తొలుత అనుమతిచ్చింది. అయితే రైతులకు పూర్తి స్థాయిలో ఎంఎస్పీ అందించేందుకు గాను  దాన్ని  60 లక్షల టన్నులకు పెంచేందుకు అంగీకరించింది. 

కొనుగోళ్ల నుంచి తప్పించుకునేందుకేనా..?

వ్యవసాయ శాఖపై రివ్యూ చేసిన ప్రతిసారి రైస్ మిల్లులు, బియ్యం ఎగుమతులపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్​ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆచరణలో మాత్రం చూపలేదు. ఇప్పుడు సడన్ గా అసలు వరి వద్దు అనడం వెనుక కొనుగోళ్ల నుంచి తప్పుకునేందుకేనా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం సీజన్​లో  సన్నాలకు రూ. వంద బోనస్​ ఇస్తామని చెప్పి చేతులెత్తేయగా, యాసంగిలోనూ సర్కార్​ వడ్ల కొనుగోళ్లపై వింతగా ప్రవర్తించింది. అసలు కొనుగోలు కేంద్రాలు ఊర్లలో ఏర్పాటు చేయబోమని, కేంద్రం కొత్త అగ్రి చట్టాలు తెచ్చిందని చెప్తూ మార్కెట్లలో అమ్ముకోవాలని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆ తర్వాత  రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కరోనా ఉన్నందున గ్రామాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయని పంట మార్కెట్​కు వస్తున్న టైంలో ఏర్పాట్లు చేశారు. అప్పటికే  చాలా చోట్ల అకాల వర్షాలకు కళ్లాల్లో వడ్లు నానిపోయాయి. ఆ వడ్లను కొనుగోలు చేయలేదు. 

కేంద్రం ఏం చెప్పిందంటే..?

వడ్ల కొనుగోళ్లపై సీజన్​ ప్రారంభానికి ముందే అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. ధాన్యం నిల్వలు పెరిగాయని, ఎక్కువగా వినియోగం అయ్యే ఫైన్​ వెరైటీలు, ఎగుమతులకు చాన్స్ ఉన్న వరి పంట సాగు చేస్తే రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఏ రాష్ట్రం నుంచి కూడా దొడ్డు రకం కొనబోమని చెప్పింది. ఈ విషయాన్ని రైతులకు చెప్పి ఫైన్​ వెరైటీలను అందుబాటులో ఉంచడంలో తెలంగాణ సర్కార్​ ఫెయిల్​ అయింది. గతేడాది సన్నాలు వేసి నష్టపోయామని భావించిన రైతులు వానాకాలంలో దొడ్డు రకమే ఎక్కువ సాగు చేశారు. అయినప్పటికీ ఈ సీజన్​లో మొదట అనుకున్న దానికంటే ఎక్కువగానే.. అంటే 60 లక్షల టన్నుల వడ్లు (రకం ఏదైనా)  కొనేందుకు ఎఫ్​సీఐ ముందుకొచ్చింది. యాసంగిలో దొడ్డు రకం ఇంకా ఎక్కువ వేసే అవకాశం ఉన్నందున మరోసారి తాము కొనేది లేదని, రైతులను ఫైన్​ వెరైటీలకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. ఇక ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా.. అవసరాలు, పరిమితుల మేర సాగు చేసుకునేలా చూడాలని చెప్పింది. అయితే రాష్ట్ర సర్కార్​ మాత్రం అసలు కేంద్రమే కొనబోమంటోందని, ధాన్యం సేకరణ బాధ్యతను పట్టించుకోవడం లేదని  ప్రచారం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.